ఫిక్సింగ్ చేశా.. అందుకు సిగ్గుపడుతున్నా

1 Jul, 2014 15:16 IST|Sakshi
ఫిక్సింగ్ చేశా.. అందుకు సిగ్గుపడుతున్నా

దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిన న్యూజిలాండ్ క్రికెటర్ లూ విన్సెంట్పై వేటుపడింది. నేరం చేసినట్టు అంగీకరించడంతో చాంపియన్స్ లీగ్ టి-20 గవర్నరింగ్ కౌన్సిల్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విన్సెంట్పై జీవితకాల నిషేధం విధించాయి. అంతర్జాతయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయాన్ని సమర్థించింది.

'నా పేరు లూ విన్సెంట్. నేను మోసం చేశా. క్రీడాకారుడిగా నా స్థాయిని దిగజార్చుకున్నాను. చాలాసార్లు డబ్బులు తీసుకుని ఫిక్సింగ్కు పాల్పడ్డాను. దేశానికి, క్రీడకు మచ్చతెచ్చాను. తప్పు చేసినందుకు సిగ్గుపడుతున్నా. చాలా ఏళ్లుగా ఈ చేదు రహస్యం నాలో దాచుకున్నా. నిజం చెప్పాలని నిర్ణయించుకున్నా' అని విన్సెంట్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అతనిపై వేటు వేశారు.

2008లో జరిగిన ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలో విన్సెంట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు. నిషేధానికి గురైన ఇండియన్ క్రికెట్ లీగ్లోనూ ఫిక్సింగ్కు పాల్పడినట్టు అతను అంగీకరించాడు. విన్సెంట్పై వేటువేయడాన్ని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ స్వాగతించారు. ఈ కఠిన చర్య  ఇతర ఆటగాళ్లకు ఓ హెచ్చరికలాంటిదని చెప్పారు. తప్పు చేస్తే కెరీర్, జీవితం ఎలా నాశనమవుతాయో ఇతర క్రికెటర్లు గుర్తించాలని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు