ఐసీసీ పెద్దలు.. మీరేమైనా మందు కొట్టారా?

22 Sep, 2019 15:55 IST|Sakshi
గతేడాది నవంబర్‌లో గావస్కర్‌ చేతుల మీదుగా ద్రవిడ్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ పురస్కారాన్ని స్వీకరిస్తున్న దృశ్యం

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) మరోసారి తప్పులో కాలేసింది. గతంలో క్రికెటర్లకు బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పే క్రమంలో ఒకరి ఫొటో బదులు మరొకరి ఫొటో పోస్ట్‌ చేసి అబాసు పాలైన ఐసీసీ.. తాజాగా మరో పెద్ద తప్పిదం చేసింది. ప్రపంచ క్రికెట్‌లో ‘ద వాల్‌’గా కీర్తించబడ్డ భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ అంటూ ఐసీసీ తన హాల్‌ హాఫ్‌ ఫేమ్‌ పేజీలో ఉంచింది. ఇది వెంటనే గుర్తించి తప్పిదం సరి చేసుకున్నప్పటికీ అప్పటికే వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శల పాలైంది.

గతేడాది నవంబర్‌లో రాహుల్‌ ద్రవిడ్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కిన సంగతి తెలిసిందే.  దీనిలో భాగంగా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ పేజీలో రాహుల్‌ ద్రవిడ్‌ను ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అని పేర్కొంటూ తాజా ఒక పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో పెట్టింది. దీన్ని  వెంటనే సవరించుకున్నప్పటికీ  అది స్వల్ప సమయంలోనే క్రికెట్‌ అభిమానుల కంటబడటంతో ఐసీసీని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ‘ ఐసీసీ పెద్దలు మందు కొట్టారా.. లేక అంతకుమించి ఏమైనా కొట్టారా’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ‘ కనీసం రాహుల్‌ ద్రవిడ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ ఏమిటో కూడా తెలియకుండానే హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటిచ్చారా’ అని మరొకరు విమర్శించారు. ‘ ఐసీసీ పెద్ద తప్పు చేసింది.. వెంటనే దాన్ని సరి చేసుకుంటే రాహుల్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ గౌరవం కంటే ఎక్కువ ఇచ్చినట్లు’ అని మరొక అభిమాని మండిపడ్డాడు.  ఇలా తమదైన శైలిలో ఐసీసీ చేసిన తప్పిదాన్ని పెద్ద సంఖ్యలో తప్పుబడుతున్నారు ద్రవిడ్‌ అభిమానులు.

ఐసీసీ  హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఐదో భారత క్రికెటర్‌ ద్రవిడ్‌. బిషన్‌ సింగ్‌ బేడీ, కపిల్‌ దేవ్‌, సునీల్‌ గావస్కర్‌, అనిల్‌ కుంబ్లేలు అంతకుముందు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న భారత క్రికెటర్లు.  రాహుల్‌ ద్రవిడ్‌ తన 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో 13, 288 టెస్టు పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు, 63 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 12 సెంచరీలు, 83 హాఫ్‌ సెంచరీల సాయంతో 10,889 పరుగులు నమోదు చేశాడు.

మరిన్ని వార్తలు