అఫ్గాన్‌కు స్కాట్లాండ్‌ షాక్‌

5 Mar, 2018 04:53 IST|Sakshi
కాలమ్‌ మెక్‌లియోడ్‌

ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ  

బులవాయో: ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఫేవరెట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌కు స్కాట్లాండ్‌ షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ కాలమ్‌ మెక్‌లియోడ్‌ (146 బంతుల్లో 157 నాటౌట్‌; 23 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో స్కాట్లాండ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అతి పిన్న సారథి రషీద్‌ ఖాన్‌ నేతృత్వంలో అఫ్గాన్‌ మొదట 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది.

నబీ (92; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), నజీబుల్లా జద్రాన్‌ (67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వీల్, బెరింగ్టన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత స్కాట్లాండ్‌ 47.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి గెలిచింది. మెక్‌ లియోడ్‌కు బెరింగ్టన్‌ (67; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలుపొందగా, యూఏఈ కూడా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలోనే 56 పరుగుల తేడాతో పపువా న్యూగినియాపై నెగ్గింది.  

జింబాబ్వే శుభారంభం
మరోవైపు ఆతిథ్య జింబాబ్వే తొలి మ్యాచ్‌లో 116 పరుగుల తేడాతో నేపాల్‌పై జయభేరి మోగించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన  జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 380 పరుగులు సాధించింది. బ్రెండన్‌ టేలర్‌ (91 బంతుల్లో 100; 7 ఫోర్లు, ఒక సిక్స్‌), సికిందర్‌ రజా (66 బంతుల్లో 123; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) ధాటిగా ఆడి సెంచరీలు చేయడం విశేషం. ఐదో వికెట్‌కు వీరిద్దరు 173 పరుగులు జోడించారు. అనంతరం నేపాల్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసి ఓడిపోయింది. ‘సెంచరీ హీరో’ సికిందర్‌ రజా బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు.  

                                          సికిందర్‌ రజా

మరిన్ని వార్తలు