కోచ్‌లతో ఆటలా..!

22 Jul, 2015 01:31 IST|Sakshi
కోచ్‌లతో ఆటలా..!

ఏ ఆటైనా ఆడించడం కోచ్ పని... నిర్వహించడం పరిపాలకుడి పని. కోచ్ పనిలో పరిపాలకుడు వేలుపెడితే నష్టమే ఎక్కువ. ఈ చిన్న విషయాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు మరచిపోయారు. తన నియంతృత్వ ఆలోచనా విధానంతో కోచ్‌ను తప్పించారు. మొత్తం దేశంలో హాకీ అంతా తన చేతుల్లోనే ఉండాలనే ఆలోచనతో ఆయన మరోసారి గిల్‌ను గుర్తుకు తెచ్చారు. జాతీయ క్రీడను గాడిలో పెట్టాల్సిన పరిపాలకులు... తమ అహం కోసం కోచ్‌లను తప్పిస్తూ వాళ్లతో ఆటలాడుతున్నారు.
 
సమయం ఇవ్వకుండానే సాగనంపుతున్నారు
ఇప్పటికి ఆరుగురు విదేశీ కోచ్‌లపై వేటు
వచ్చే ఏడాదే రియో ఒలింపిక్స్

 
సాక్షి క్రీడావిభాగం
‘వాన రాకడ... ప్రాణం పోకడ’ కచ్చితంగా ఎవరూ చెప్పలేరని అంటారు. అలాగే భారత హాకీలో కొత్త కోచ్ ఎప్పుడు వస్తాడో, ఎంత కాలం ఉంటాడో, ఎందుకు వెళ్లిపోతాడో కూడా అంచనా వేయలేని పరిస్థితి. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం కేపీఎస్ గిల్ హయాంలో  స్వదేశీ, విదేశీ అని లేకుండా ‘కోచ్‌లతో కుర్చీలాట’ మొదలైంది. సమాఖ్య పేరు మారినా, అధికారం బదలాయింపు జరిగినా కోచ్‌లతో గిల్లీకజ్జాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ హాకీని ఏలిన భారత్ నేడు తమ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. జాతీయ క్రీడను గాడిలో పెట్టాల్సిన వారే ఈ ఆటతో ఆటలాడుకుంటున్నారు. తమ పెత్తనమే ఉండాలని కోరుకుంటూ, పట్టుదలకు పోయి ఆటకు అన్యాయం చేస్తున్నారు.
 
రాచ్ నుంచి పాల్ వరకు...
రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ఒలింపిక్ స్వర్ణాలు నెగ్గిన భారత్‌కు తొలిసారి 2004లో గెరార్డ్ రాచ్ (జర్మనీ) రూపంలో విదేశీ కోచ్ వచ్చారు. అయితే ఏథెన్స్ ఒలింపిక్స్‌లో, చాంపియన్స్ ట్రోఫీలో భారత పేలవ ప్రదర్శన కారణంగా ఆయనపై అదే ఏడాది వేటు వేశారు. ఆ తర్వాత వచ్చిన విదేశీ కోచ్‌లు కూడా రావడం, బాధ్యత తీసుకోవడం, కొన్నాళ్లు ఉండటం ఆ తర్వాత వెళ్లిపోవడం జరుగుతోంది. తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ వాన్ యాస్ విషయంలోనూ ఇదే జరిగింది. 2018 ప్రపంచ కప్ వరకు ఆయనను భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఈ ఫిబ్రవరిలో నియమించారు. ఆరు నెలలు కూడా గడవకముందే ఆయనపై వేటు వేశారు.
 
 
నాడు గిల్... నేడు బాత్రా
పంజాబ్ ‘సూపర్‌కాప్’ కేపీఎల్ గిల్ తన హయాంలో స్వదేశీ కోచ్‌లతో ఓ ఆటాడుకున్నారు. కోచ్‌లను నియమించడం, ఫలితాలు వస్తున్న సమయంలో వారిని అకారణంగా తప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు గిల్ హయాంలో ఎనిమిది మంది (జఫర్ ఇక్బాల్, సెడ్రిక్ డిసౌజా, భాస్కరన్, పర్గత్ సింగ్, ఎం.కె.కౌశిక్, హర్‌చరణ్ సింగ్, సీఆర్ కుమార్, రాజిందర్ సింగ్) స్వదేశీ కోచ్‌లపై వేటు పడింది. ఆ తర్వాత 2004 నుంచి 2015 వరకు ఏడుగురు (గెరార్డ్ రాచ్, జోస్ బ్రాసా, మైకేల్ నాబ్స్, రోలెంట్ ఆల్ట్‌మన్స్, గ్రెగ్ నికోల్, టెర్రీ వాల్ష్, పాల్ వాన్ యాస్) విదేశీ కోచ్‌లను తప్పించారు. రోలెంట్ ఆల్ట్‌మన్స్ ప్రస్తుతం భారత హాకీ జట్టుకు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
ఆనాడు గిల్ నియంతృత్వ ధోరణిపై తిరుగుబాటు చేసిన నాటి భారత హాకీ సమాఖ్య (ఐహెచ్‌ఎఫ్) ఉపాధ్యక్షుడు, నేటి హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా ఇప్పుడు గిల్ అడుగుజాడల్లో నడస్తుండటం గమనార్హం. పారిశ్రామికవేత్త అయిన బాత్రా భారత హాకీ పురోగతికి తనవంతు కృషి చేస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే మొత్తం హాకీ ఇండియా తన చేతుల్లోనే ఉండాలనుకోవాలనే ఆయన అత్యాశ ఆటకు చేటు చేస్తోంది. గతేడాది కోచ్ టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో భారత్ ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. అయితే టెర్రీ వాల్ష్ కుదురుకున్నాడని అనుకుంటున్న తరుణంలో ఆయనను సాగనంపారు. ఆయన స్థానంలో వచ్చిన పాల్ వాన్ యాస్‌కు దీనికి మినహాయింపు కాదు. ఇటీవల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ సందర్భంగా మలేసియాతో మ్యాచ్ అనంతరం నరీందర్ బాత్రా నేరుగా మైదానంలోకి రావడం... ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేయడం... ఆయనను అక్కడి నుంచి వెళ్లాపోవాలని కోచ్ పాల్ కోరినందుకే ఆయనపై వేటు పడిందని అంటున్నారు.  
 
ఇకనైనా మేలుకుంటారా...
రియో ఒలింపిక్స్‌కు ఇంకా ఏడాది సమయం ఉంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత భారత హాకీ జట్టు ఖాతాలో మరో పతకం చేరలేదు. ఒలింపిక్స్ సన్నాహాలపై ప్రభావం పడకుండా ఉండాలంటే వెంటనే కొత్త కోచ్‌ను నియమించడమో లేక హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌గా ఉన్న రోలెంట్ ఆల్ట్‌మన్స్‌కు మరోసారి చీఫ్ కోచ్ బాధ్యతలు అప్పగించడమో చేయాలి. టెర్రీ వాల్ష్‌ను తప్పించిన తర్వాత కొంతకాలంపాటు ఆల్ట్‌మన్స్ భారత్‌కు తాత్కాలిక కోచ్‌గా పనిచేశారు. రెండేళ్లుగా జట్టుతో ఉన్నందున ఆయనకు భారత హాకీ బలాబలాలపై మంచి అవగాహన ఏర్పడింది. కొత్త కోచ్‌ను నియమించే బదులు రియో ఒలింపిక్స్ వరకు ఆల్ట్‌మన్స్‌ను కోచ్‌గా కొనసాగించాలని భారత ఆటగాళ్లు కూడా కోరుకుంటున్నారు. ఇకనైనా హాకీ ఇండియా అధికారులు తమ పొరపాట్లను సరిదిద్దుకొని భారత హాకీకి మేలు చేసే నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
 
విదేశీ కోచ్‌లు వచ్చి పోయారిలా...
1. గెరార్డ్ రాచ్ (జర్మనీ)
నియామకం: భారత జట్టు తొలి విదేశీ కోచ్‌గా 2004 జూన్‌లో నియమించారు. ఏథెన్స్ ఒలింపిక్స్, చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. దాంతో అదే ఏడాది డిసెంబరులో రాచ్‌పై వేటు పడింది.
 
2. జోస్ బ్రాసా (స్పెయిన్)
వేతనం: రూ. 7 లక్షలు (నెలకు)
నియామకం: 2009 మేలో కోచ్‌గా ఎంపిక చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు.
వేటు పడిందిలా: బ్రాసా అధ్వర్యంలో భారత్ 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించింది. అయితే అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుపొందకపోవడంతో భారత్ నేరుగా లండన్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయింది. 2010లో ఆయన కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు.
 
3. నాబ్స్ (ఆస్ట్రేలియా)
వేతనం: రూ. 6.5 లక్షలు
నియామకం: 2011 జూన్‌లో కోచ్‌గా నియమించారు. 2016 రియో ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు.
వేటు పడిందిలా: నాబ్స్ ఆధ్వర్యంలో భారత్ 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే లండన్ ఒలింపిక్స్‌లో భారత్ చిట్టచివరిదైన 12వ స్థానంలో నిలిచింది.  2013 జూన్‌లో ఆయనపై వేటు వేశారు.
 
4. గ్రెగ్ నికోల్ (దక్షిణాఫ్రికా)
నియామకం: 2013లో మైకేల్ నాబ్స్‌ను తప్పించాక కొంతకాలంపాటు గ్రెగ్ నికోల్ (దక్షిణాఫ్రికా) భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు.
వేటు పడిందిలా: నికోల్ ఆధ్వర్యంలో భారత్ 2013లో జపాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగింది. ఈ టోర్నీలో టీమిండియా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. నికోల్ న్యూజిలాండ్  జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వెళ్లిపోయారు.
 
5. టెర్రీ వాల్ష్ (ఆస్ట్రేలియా)
వేతనం: రూ. 10 లక్షలు
నియామకం: 2013 అక్టోబరులో కోచ్‌గా తీసుకొచ్చారు. 2016 రియో ఒలింపిక్స్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. టెర్రీ వాల్ష్ ఆధ్వర్యంలో భారత్ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది.
 వేటు పడిందిలా: ఆసియా క్రీడలు ముగిశాక హాకీ ఇండియా, సాయ్ అధికారులతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయనను తప్పించారు.
 
6. వాన్ యాస్ (నెదర్లాండ్స్)
వేతనం: రూ. 7.5 లక్షలు
నియామకం: ఈ ఏడాది ఫిబ్రవరిలో కోచ్‌గా నియమించారు. 2018 ప్రపంచకప్ వరకు ఆయనతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు.
వేటు పడిందిలా: ఇటీవల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ టోర్నీ సందర్భంగా హాకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో మైదానంలో వాగ్వాదం. టోర్నీ ముగిశాక నేరుగా నెదర్లాండ్స్ వెళ్లిపోయిన పాల్ తిరిగి భారత్‌కు రాలేదు. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన వారిలో కోచ్‌గా ఆయన పేరు లేదు.

>
మరిన్ని వార్తలు