న్యూజిలాండ్‌ ‘ఎ’ 176/1

18 Nov, 2018 02:33 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లోభారత్‌ ‘ఎ’ 467/8 డిక్లేర్డ్‌ 

శతకం చేజార్చుకున్న పార్థివ్‌ పటేల్‌  

మౌంట్‌ మాంగనీ: బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌ ‘ఎ’... బౌలింగ్‌లో తేలిపోవడంతో న్యూజిలాండ్‌ ‘ఎ’ దీటుగా బదులిస్తోంది. ఓపెనర్‌ హామిష్‌ రూథర్‌ఫర్డ్‌ (169 బంతుల్లో 106 బ్యాటింగ్‌; 16 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకం, మరో ఓపెనర్‌ విలియమ్‌ యంగ్‌ (49) రాణించడంతో తొలి అనధికార టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 176/1తో నిలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 340/5తో శనివారం బరిలో దిగిన భారత్‌ ‘ఎ’ 476/8 వద్ద డిక్లేర్‌ చేసింది. వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ (136 బంతుల్లో 94; 11 ఫోర్లు) సెంచరీని అందుకోలేకపోయాడు.

ఆల్‌రౌండర్లు విజయ్‌ శంకర్‌ (96 బంతుల్లో 66; 6 ఫోర్లు) అర్ధశతకం చేయగా, కృష్ణప్ప గౌతమ్‌ (73 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. గౌతమ్‌ ఔట్‌ కాగానే భారత్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం కివీస్‌ ‘ఎ’కు ఓపెనర్లు 121 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ముఖ్యంగా రూథర్‌ఫర్డ్‌ సాధికారికంగా ఆడాడు. పేసర్లను సమర్థంగా ఎదుర్కొని ముచ్చటైన బౌండరీలు కొట్టాడు. యంగ్‌ను ఔట్‌ చేసిన కృష్ణప్ప గౌతమ్‌  తొలి వికెట్‌ పడగొట్టాడు. భారత్‌ ‘ఎ’ స్కోరుకు కివీస్‌ ‘ఎ’ ఇంకా 291 పరుగులు వెనుకబడి ఉంది.     రూథర్‌ ఫర్డ్‌కు తోడుగా సీఫ్రెట్‌ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.  

మరిన్ని వార్తలు