వరల్డ్‌ టీ20: భారత్‌ జైత్రయాత్ర

29 Feb, 2020 12:17 IST|Sakshi

షఫాలీ మళ్ళీ కుమ్మేసింది..

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్‌-ఎలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించి తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ను అజేయంగా ముగించింది. ఫలితంగా గ్రూప్‌-ఎలో టాప్‌ ప్లేస్‌ను ఖాయం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్‌లో శ్రీలంక మహిళలు నిర్దేశించిన 114 పరుగుల టార్గెట్‌ను భారత జట్టు 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక మహిళలు నిర్ణీత ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేశారు. చమిరా ఆటపట్టు(33), కవిషా దిల్హరి(25)లు మాత్రమే మోస్తరుగా ఆడటంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. (కెప్టెన్‌ అయినంత మాత్రాన అలా చేస్తావా?)

భారత బౌలర్లలో స్పిన్నర్‌ రాధా యాదవ్‌ నాలుగు వికెట్లు సాధించగా, మరో స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌, శిఖా పాండేలకు తలో వికెట్‌ దక్కింది.  స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ జట్టులో ఓపెనర్‌ స్మృతీ మంధాన(17) మరోసారి నిరాపరిచారు. కాగా, మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ తన ఫామ్‌ను కొనసాగించారు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 47 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. హాఫ్‌ సెంచరీకి చేరువగా వచ్చిన షఫాలీ అనవసర పరుగు కోసం యత్నంచి రనౌట్‌ అయ్యారు. భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(15) విఫలం కాగా, రోడ్రిగ్స్‌( 15 నాటౌట్‌), దీప్తి శర్మ(15 నాటౌట్‌)లు చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు వరుసగా నాల్గో విజయం. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్న భారత జట్టు.. తమ ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో కూడా గెలుపును అందుకుని తమ తిరుగులేదని నిరూపించింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

మరిన్ని వార్తలు