సిరీస్ విజయంపై భారత్ దృష్టి

9 Aug, 2016 04:56 IST|Sakshi
సిరీస్ విజయంపై భారత్ దృష్టి

నేటి నుంచి వెస్టిండీస్‌తో మూడో టెస్టు
రాత్రి 7.30 గంటల నుంచి టెన్-2లో ప్రత్యక్ష ప్రసారం

సెయింట్ లూసియా: రెండో టెస్టులో విజయం అంచుల వరకు వచ్చినా డ్రాతో సరిపెట్టుకున్న భారత క్రికెట్ జట్టు నేటి (మంగళవారం)నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనుంది. ఇప్పటికే తొలి టెస్టును నెగ్గిన కోహ్లి సేన 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ను నెగ్గి నాలుగు టెస్టుల సిరీస్‌ను దక్కించుకోవాలని చూస్తోంది. అదే జరిగితే వరుసగా హ్యాట్రిక్ సిరీస్‌లను గెల్చినట్టవుతుంది. ఇంతకుముందు శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై భారత్ టెస్టు సిరీస్‌లు కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన రెండో టెస్టులో చివరి రోజు రోస్టన్ చేజ్ అనూహ్యంగా శతకంతో అదరగొట్టగా అటు భారత బౌలర్లు ప్రత్యర్థికి మిగిలిన ఆరు వికెట్లను తీయలేకపోవడంతో తమ బౌలింగ్ కూర్పుపై కూడా భారత టీమ్ మేనేజిమెంట్ దృష్టి సారించనుంది. తాజా టెస్టు జరిగే డారెన్ స్యామీ స్టేడియంలో ఇంతకుముందు నాలుగు టెస్టులు మాత్రమే జరగ్గా మూడింటిలో ఫలితం రాలేదు. 2006 పర్యటనలో భారత్ ఇక్కడ ఆడగా ఆ మ్యాచ్ డ్రాగానే ముగిసింది. ఈసారి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీ స్కోరు నమోదు కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 అదే జట్టుతో బరిలోకి...
రెండో టెస్టు ఆడిన జట్టునే భారత్ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దించనుంది. ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో అవకాశం దక్కించుకున్న కేఎల్ రాహుల్ ఏకంగా సెంచరీతోనే రాణించాడు. దీంతో జట్టు కూర్పును మార్చే ఆలోచన కనిపించడం లేదు. ఇక ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే మరోసారి ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. పేసర్లలో షమీ, ఇషాంత్, ఉమేశ్‌తో పాటు స్పిన్నర్లలో అశ్విన్, మిశ్రా ఈ సిరీస్‌లో ఇప్పటికే తమ సత్తాను చూపిస్తున్నారు. అయితే గత మ్యాచ్ చివరి రోజు మిశ్రా అనుకున్న రీతిలో బౌలింగ్ చేయకపోవడం దెబ్బతీసింది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలనుకుంటే యాదవ్ స్థానంలో జడేజా రావచ్చు. బ్యాటింగ్‌లో ధావన్, పుజారాల నుంచి భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది.

 గెలుపే లక్ష్యంగా విండీస్
సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో బోణీ చేయాలనే ఆరాటంలో విండీస్ ఉంది. రెండో టెస్టులో పోరాట పటిమ ఈ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ బలహీనత తీవ్రంగా ఆందోళనపరిచే అంశం. ఓపెనర్ చంద్రిక స్థానంలో షాయ్ హోప్ ఆడనున్నాడు.

 జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, మిశ్రా, ఇషాంత్, యాదవ్/జడేజా, షమీ.
విండీస్: హోల్డర్ (కెప్టెన్), బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, హోప్, శామ్యూల్స్, బ్లాక్‌వుడ్, చేజ్, డోరిచ్, కమిన్స్, బిషూ, గాబ్రియెల్.

మరిన్ని వార్తలు