ప్రపంచకప్‌ సైన్యం కోసం!

20 Aug, 2017 01:26 IST|Sakshi
ప్రపంచకప్‌ సైన్యం కోసం!

ప్రయోగాల బాటలో భారత్‌  
ధోనిపైనే అందరి దృష్టి
శ్రీలంకతో నేటి నుంచి ఐదు వన్డేల సిరీస్‌
మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  


శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను సునాయాసంగా 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. అయితే భారత్‌ మాత్రం దీన్ని కేవలం ద్వైపాక్షిక సిరీస్‌గా మాత్రమే చూడటం లేదు. ఎందుకంటే ఇప్పటికే చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తమ ప్రపంచకప్‌ సన్నాహకాలు ప్రారంభమైనట్టే అని ప్రకటించారు. ఓ ఏడాదిపాటు రొటేషన్‌ ప్రకారం తమ యువ ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయాలని భావిస్తోంది.  ఇప్పటి నుంచే తమ వనరులను సరిచూసుకునేందుకు  ఇది ఓ అవకాశంగా తీసుకోనుంది. ఇక సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఎంఎస్‌ ధోనిపై అందరి దృష్టీ నెలకొనడంతో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు ప్రపంచకప్‌కు నేరుగా బెర్త్‌ దక్కించుకోవాలంటే శ్రీలంక మరో రెండు విజయాలు సాధించాల్సి ఉంది. అసలే ఆత్మవిశ్వాసం             అడుగంటిన వేళ ఈ వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఏమేరకు రాణించగలదో వేచిచూడాలి.  

దంబుల్లా: టెస్టు సిరీస్‌లో దుమ్మురేపిన టీమిండియా వన్డేల్లోనూ మెరుపులు మెరిపించేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు స్థానిక రణగిరి దంబుల్లా అంతర్జాతీయ మైదానంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను చితక్కొట్టిన కోహ్లి బృందం ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్‌ కోసం జట్టును ఇప్పటి నుంచే తయారు చేయాలనే ఆలోచనతో ఉన్న టీమ్‌ మేనేజిమెంట్‌ ఆ దిశగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలనుకుంటోంది. బలహీనంగా కనిపిస్తున్న లంకపై యువ ఆటగాళ్లను పరీక్షించనుంది. ఇప్పటికే యువరాజ్‌ సింగ్‌పై వేటు వేయగా... మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై తాను ప్రపంచ కప్‌ జట్టులో ఉండాల్సిన ఆటగాడినే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ఈ సిరీస్‌కు ముందు జింబాబ్వేపై అవమానకర రీతిలో 2–3 తేడాతో ఓడిన లంక పటిష్ట భారత్‌ను నిలువరించి పోయిన పరువును దక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానం (88 పాయింట్లు)లో ఉన్న లంక సెప్టెంబర్‌ 30 కటాఫ్‌ తేదీలోపు నేరుగా ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకోవాలంటే ఈ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాలి.  

నాలుగో స్థానంలో రాహుల్‌...
వన్డేల కోసం భారత జట్టు మారినా ఫామ్‌కు మాత్రం ఢోకా లేదు. అన్ని విభాగాల్లో జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న అనంతరం టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగిన ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ భీకర ఫామ్‌ను చాటుకున్నాడు. అయితే వన్డేల్లో అతడిని నాలుగో స్థానంలో బరిలోకి దించనున్నారు. గతేడాది అరంగేట్రంలోనే శతకం బాదిన అతను గాయాల కారణంగా కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. అన్నింట్లోనూ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. అయితే ఈసారి ఓపెనింగ్‌ స్లాట్‌ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లతో భర్తీ చేస్తారు. ప్రపంచకప్‌ అంచనాల్లో రాహుల్‌ కచ్చితంగా ఉంటాడు కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేయలేరు. అందుకే అతడి స్థానాన్ని మిడిలార్డర్‌కు మార్చనున్నారు. అయితే 2015 వరల్డ్‌ కప్‌ నుంచి ఇదే స్థానంలో అజింక్య రహానే మెరుగ్గానే ఆడుతున్నాడు. కానీ రహానే ఇప్పుడు మూడో ఓపెనర్‌గానే ఉండే అవకాశం ఉంది. ఐదో స్థానంలో ధోని రావడం ఖాయమే. ఇక మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా ఆ తర్వాత స్థానాల్లో దిగనున్నారు. బుమ్రా, భువనేశ్వర్‌ పేస్‌ బౌలింగ్‌ విభాగంలో కీలకం కానున్నారు. స్పిన్‌లో కుల్దీప్‌తో పాటు అక్షర్‌ పటేల్, యజువేంద్ర చహల్‌లలో ఒకరికి చాన్స్‌ దక్కవచ్చు.

ఒత్తిడిలో శ్రీలంక...
టెస్టుల్లో వైట్‌వాష్‌ అనంతరం వన్డే సిరీస్‌ ఆడబోతున్న లంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. తమ అభిమానులను తిరిగి ఆకట్టుకోవాలంటే ఈ జట్టు తమ స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సిందే. కొత్త కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ నేతృత్వంలో నూతనోత్తేజంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి వన్డే (చాంపియన్స్‌ ట్రోఫీ)లో తామే గెలవడం లంకేయులకు కొద్దిగా ఊరటనిచ్చే విషయం.తరంగ, మాథ్యూస్, చండి మాల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌కు వెన్నెముకలా నిల వనున్నారు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ పుష్పకుమార అరంగేట్రం ఖాయమే. బౌలింగ్‌లో సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగ, ఫెర్నాండోలపై ఎక్కువగా ఆధార పడనుంది.  

జట్లు: (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, రాహుల్, ధోని, పాండే/జాదవ్, పాండ్యా, కుల్దీప్, భువనేశ్వర్, చహల్, బుమ్రా.
శ్రీలంక: తరంగ (కెప్టెన్‌), గుణతిలక, మెండిస్, డిక్‌వెలా, మాథ్యూస్, కపుగెడెర, హసరంగా, పెరీరా, ఫెర్నాండో, మలింగ, సందకన్‌.

పిచ్, వాతావరణం
ఈ ఏడాది జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇక్కడ 300కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లోనూ అలాంటి పరిస్థితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

4  శ్రీలంకతో ఈ మైదానంలో ఆడిన 11 వన్డేల్లో భారత్‌ నాలుగు మాత్రమే గెలిచింది.
2  ప్రపంచకప్‌లో నేరుగా అర్హత దక్కించుకునేందుకు శ్రీలంక గెలవాల్సిన మ్యాచ్‌లు
.

మరిన్ని వార్తలు