‘స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది..’ | Sakshi
Sakshi News home page

‘స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది..’

Published Sun, Aug 20 2017 12:54 AM

‘స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది..’

అదో విమానాశ్రయం. కానీ అక్కడి విమానాలు ఎక్కడికీ వెళ్లవు. మనల్నే స్వర్గానికి తీసుకెళ్తాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మన భాషలో చెప్పాలంటే ఇదో శ్మశానవాటిక. పేరు ‘అంతిమ్‌ ఉడాన్‌ మోక్ష ఎయిర్‌పోర్ట్‌’. గుజరాత్‌లోని సూరత్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో బర్దోలీలో ఇది ఉంది. మింధోలా నదీ తీరంలో దీనిని నిర్మించారు. ఇక్కడ విమానాల ఎనౌన్స్‌మెంట్లకు బదులు ‘స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది.. ఒకటో నంబర్‌ టెర్మినల్‌ గుండా లోపలికి తీసుకురండి..’అనే మాటలే వినబడుతుంటాయి. ఆ సూచనల మేరకు పార్థివదేహాన్ని టెర్మినల్‌ వద్ద దింపేసి, బంధుగణమంతా బయటికి వెళ్లిపోతుంది.

నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్ట్‌ లౌడ్‌స్పీకర్ల నుంచి విమానం టేకాఫ్‌ అయిన భారీ శబ్ధం వినిపిస్తుంది. ‘వారికి మోక్షం సిద్ధించింది. స్వర్గానికి వెళ్లారు’అనే ప్రకటన రావడంతో తంతు పూర్తవుతుంది. విమానాశ్రయంలో ‘స్వర్గ్‌ ఎయిర్‌లైన్స్‌’, ‘మోక్ష ఎయిర్‌లైన్స్‌’అనే రెండు విమాన ప్రతిరూపాలు ఉంటాయి. దీనిలో మూడు ఎలక్ట్రిక్, రెండు సంప్రదాయ వాటికలు ఉన్నాయి. రోజురోజుకూ రద్దీ ఎక్కువ అవుతుండటంతో దీనిని విస్తరించాలని భావిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ నిర్వాహకుడు సోమాభాయ్‌ పటేల్‌ చెప్పారు. తన బామ్మ మాట మేరకు దీనిని నిర్మించానని తెలిపారు. మొదట్లో రూ.1,000 చార్జ్‌ చేసేవాళ్లమని, క్రమంగా విరాళాలు వస్తుండటంతో ప్రస్తుతం ఉచితంగానే సేవలు అందిస్తున్నామని వివరించారు. 

Advertisement
Advertisement