భారత మహిళలదే వన్డే సిరీస్‌

12 Oct, 2019 05:30 IST|Sakshi

రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై 5 వికెట్ల తేడాతో గెలుపు

రాణించిన మిథాలీ, పూనమ్‌ రౌత్‌  

వడోదర: ఇప్పటికే టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత మహిళల జట్టు అదే దూకుడుతో వన్డే సిరీస్‌ను వశం చేసుకుంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పూనమ్‌ రౌత్‌ (92 బంతుల్లో 65; 7 ఫోర్లు), కెపె్టన్‌ మిథాలీ రాజ్‌ (82 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీల కారణంగా భారత్‌ మరో రెండు ఓవర్లు ఉండగానే విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు లిజెల్లే లీ (40; 3 ఫోర్లు, సిక్స్‌), లారా వోల్వార్డ్‌ (69; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి శుభారంభం చేశారు.

అనంతరం ప్రీజ్‌ (44; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో ఒక దశలో దక్షిణాఫ్రికా 142/3తో పటిష్టంగా కనిపించింది. అయితే చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీయడంతో పర్యాటక జట్టు అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం భారత్‌ 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. మిథాలీ రాజ్, పూనమ్‌ రౌత్‌ అర్ధ సెంచరీలకు తోడు చివర్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో భారత్‌ సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. సిరీస్‌లో చివరి వన్డే ఈనెల 14న ఇక్కడే జరుగుతుంది.

మరిన్ని వార్తలు