చాంపియన్ చక్రవర్తి

13 Nov, 2014 00:18 IST|Sakshi
చాంపియన్ చక్రవర్తి

న్యూఢిల్లీ: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు అదరగొట్టారు. అండర్-18 ఓపెన్ విభాగంలో ఎం.చక్రవర్తి రెడ్డి విజేతగా అవతరించగా... అండర్-14 ఓపెన్ విభాగంలో హర్ష భరతకోటి రన్నరప్‌గా నిలిచాడు. అండర్-18 విభాగంలోనే హైదరాబాద్ ప్లేయర్ ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. బుధవారం రాత్రి ముగిసిన ఈ టోర్నీలో అండర్-18 స్టాండర్డ్ విభాగంలో చక్రవర్తి రెడ్డి (భారత్), మసూద్ మోసదెగఫూర్ (ఇరాన్) 6.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు.

అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... చక్రవర్తి రెడ్డికి టైటిల్ ఖాయమైంది. మసూద్ రన్నరప్‌గా నిలిచాడు. 6 పాయింట్లతో చిన్‌గిజ్ సెరిక్‌బె (కజకిస్థాన్) మూడో స్థానాన్ని పొందాడు. 5.5 పాయింట్లతో బాలచంద్ర ప్రసాద్ నాలుగో స్థానంతో సంతృప్తి పడగా... హైదరాబాద్‌కే చెందిన ఎన్.కృష్ణ తేజ 5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో మెలిస్ మమతోవ్ (కిర్గిజిస్థాన్)పై చక్రవర్తి నెగ్గగా... మెజియా గియోవాని (ఫిలిప్పీన్స్) చేతిలో బాలచంద్ర ప్రసాద్ ఓడిపోయాడు. అలీషేర్ కరిమోవ్ (ఇరాన్)తో గేమ్‌ను కృష్ణ తేజ ‘డ్రా’ చేసుకున్నాడు.

 అండర్-14 ఓపెన్ విభాగంలో హర్ష భరతకోటి (భారత్), అమీన్ తబతబెయి (ఇరాన్) 7 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా అమీన్‌కు స్వర్ణం ఖాయమవ్వగా... హర్షకు రజతం దక్కింది. ఈ టోర్నీలో హర్ష అజేయంగా నిలిచాడు. అతను ఐదు గేముల్లో గెలిచి, మిగతా నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. అండర్-18 విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పొట్లూరి సుప్రీత 4.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచింది. గురువారం బ్లిట్జ్ విభాగం పోటీలతో ఈ చాంపియన్‌షిప్ ముగుస్తుంది.

మరిన్ని వార్తలు