భారత అథ్లెట్లకు ‘పవర్’ కోత

25 Apr, 2016 00:31 IST|Sakshi

చేజారిన ‘రియో’ బెర్త్‌లు

న్యూఢిల్లీ: ఓ స్టేడియంలోని విద్యుత్ వెతలు భారత అథ్లెట్లకు తీరని వ్యథను మిగిల్చాయి. అథ్లెట్ల విజయాలు మొదలు... జాతీయ రికార్డులు, ఒలింపిక్  క్వాలిఫికేషన్ టైమింగ్‌లన్నీ పుటలకెక్కని రికార్డులుగానే మిగిలాయి. ఇదెక్కడో సాదాసీదా పట్టణంలోనో, నగరంలోనూ జరిగిందనుకునేరు! సాక్షాత్తు దేశ రాజధానిలోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఇండియన్ గ్రాండ్‌ప్రికి వేదికైన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కరెంట్ లేని కారణంగా చేతిరాతతో రాసిన రికార్డులు, విజయాలు అసలు లెక్కలోకే రాకుండా పోయాయి. ఒలింపిక్ నిర్వాహకులు ఫొటో ప్రింట్ డిజిటల్ గణాంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

పెన్నులు, పెన్సిళ్లతో రాసిన మాన్యువల్ రికార్డులను ఏమాత్రం తీసుకోరు. దీంతో పలువురు అథ్లెట్లు సాధించిన విజయాలు, మీట్ రికార్డులన్నీ నీటిమూటలయ్యాయి. పురుషుల, మహిళల 100 మీ. స్ప్రింట్‌లో ఒడిశా అథ్లెట్లు అమియా కుమార్ (10.09 సె.), శర్బాని నంద (11.23 సె) సాధించిన ఘనతలు అంతర్జాతీయ గుర్తింపునకు నోచుకోలేకపోయాయి.

రియో క్వాలిఫికేషన్ టైమింగ్ (10.16 సె. పురుషులకు, 11.32 సె. మహిళలకు)కు ఎంతో మెరుగైనప్పటికీ క్రీడాపాలకుల నిర్లక్ష్యంతో ఈ స్ప్రింటర్లు బలిపశువులయ్యారు. దీనిపై ఢిల్లీ అథ్లెటిక్ సంఘం... ‘సాయ్’పై ధ్వజమెత్తింది. షార్ట్ సర్క్యూట్ వల్లే విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని, ఇవన్నీ సంబంధిత రాష్ట్రాలే చూసుకోవాలని ‘సాయ్’ చేతులు దులుపుకుంది.
 

>
మరిన్ని వార్తలు