తిలక్‌ వర్మకు చోటు

3 Dec, 2019 01:00 IST|Sakshi

అండర్‌–19 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

కెప్టెన్‌గా ప్రియమ్‌ గార్గ్‌

ముంబై: గత కొంత కాలంగా భారత యూత్‌ జట్టు సభ్యుడిగా నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మకు మరో అరుదైన అవకాశం లభించింది. వచ్చే నెలలో జరిగే అండర్‌–19 ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టులోకి అతను ఎంపికయ్యాడు. 2018–19 సీజన్‌ కూచ్‌బెహర్‌ ట్రోఫీలో తిలక్‌ 6 మ్యాచ్‌లలో 86.56 సగటుతో 779 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వన్డే టోర్నీ వినూ మన్కడ్‌ ట్రోఫీలో కూడా 84.50 సగటుతో 8 మ్యాచ్‌లలో 507 పరుగులు సాధించాడు.

ఈ ప్రదర్శనే అతను భారత అండర్‌–19 టీమ్‌లో రెగ్యులర్‌గా మారేందుకు కారణమైంది. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ తిలక్‌ ఆడాడు. దక్షిణాఫ్రికాలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు వరల్డ్‌ కప్‌ జరుగుతుంది. ఇందు కోసం భారత జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రియమ్‌ గార్గ్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపిక కాగా... యూపీకే చెందిన ధ్రువ్‌ జురేల్‌  వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

యూపీ సీనియర్‌ జట్టులో ఇప్పటికే రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న ప్రియమ్‌ 2018–19 రంజీ సీజన్‌లో 814 పరుగులతో సత్తా చాటాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో డబుల్‌ సెంచరీ సహా అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగుతున్న ముంబై ఆటగాడు యశస్వి జైస్వాల్‌ కూడా ప్రపంచ కప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అండర్‌–19 ప్రపంచ కప్‌లో 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు సూపర్‌ లీగ్‌ దశకు అర్హత సాధిస్తాయి. నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) అండర్‌–19 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన భారత్‌ ఈ సారి గ్రూప్‌ ‘ఎ’లో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో కలిసి బరిలోకి దిగుతోంది.

రక్షణ్‌కు చోటు... 
ప్రపంచ కప్‌కు ముందే భారత అండర్‌–19 జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభమవుతుంది. ముందుగా సఫారీలతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు జట్లతో పాటు న్యూజిలాండ్, జింబాబ్వే భాగంగా నాలుగు దేశాల వన్డే టోర్నీ కూడా జరుగుతుంది. ఈ సిరీస్‌ల కోసం సెలక్టర్లు అదనంగా మరో ఆటగాడిని ఎంపిక చేశారు. 16వ ఆటగాడిగా హైదరాబాద్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ సీటీఎల్‌ రక్షణ్‌కు ఆ అవకాశం లభించింది. రక్షణ్‌ ఇటీవల అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడాడు.

ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత అండర్‌–19 జట్టు
ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ చంద్‌ జురేల్‌ (వైస్‌ కెప్టెన్‌), తిలక్‌ వర్మ (హైదరాబాద్‌), యశస్వి జైస్వాల్, అథర్వ అంకోలేకర్, దివ్యాంశ్‌ సక్సేనా, కార్తీక్‌ త్యాగి (ముంబై), శుభాంగ్‌ హెగ్డే, విద్యాధర్‌ పాటిల్‌ (కర్ణాటక), కుమార్‌ కుశాగ్ర, సుశాంత్‌ మిశ్రా (జార్ఖండ్‌), రవి బిష్ణోయ్, ఆకాశ్‌ సింగ్‌ (రాజస్తాన్‌), శాశ్వత్‌ రావత్‌ (బరోడా), దివ్యాంశ్‌ జోషి (మిజోరం).

>
మరిన్ని వార్తలు