ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా...

9 Jun, 2019 13:56 IST|Sakshi

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల సిరీస్‌ ఫైనల్స్‌ హాకీ టోర్నీ బరిలో భారత జట్టు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో బెర్త్‌ సాధించే క్రమంలో తొలి లక్ష్యమైన క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత హాకీ జట్టు మహిళల సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనుంది. ఈనెల 15 నుంచి 23 వరకు జపాన్‌లోని హిరోషిమాలో ఈ టోర్నీ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు రాణి రాంపాల్‌ నాయకత్వంలోని భారత జట్టు శనివారం జపాన్‌కు బయలుదేరింది. పూల్‌ ‘ఎ’లో భారత్‌తోపాటు పోలాండ్, ఉరుగ్వే, ఫిజీ జట్లు ఉన్నాయి.

పూల్‌ ‘బి’లో జపాన్, చిలీ, రష్యా, మెక్సికో జట్లకు స్థానం కల్పించారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించాలంటే భారత జట్టు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. భారత జట్టు తమ లీగ్‌ మ్యాచ్‌లను వరుసగా ఉరుగ్వేతో (జూన్‌ 15న), పోలాండ్‌తో (జూన్‌ 16న), ఫిజీతో (జూన్‌ 18న) ఆడుతుంది. ఫైనల్‌ 23న జరుగుతుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది. 
 

మరిన్ని వార్తలు