భారత్‌ క్లీన్‌స్వీప్‌ 

26 Sep, 2018 01:53 IST|Sakshi

 శ్రీలంకతో టి20 సిరీస్‌ను 4–0తో నెగ్గిన హర్మన్‌ప్రీత్‌ బృందం 

కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు జైత్రయాత్ర ముగిసింది. వన్డే సిరీస్‌ను 2–1తో హస్తగతం చేసుకున్న మన అమ్మాయిలు... పొట్టి ఫార్మాట్‌లోనూ దుమ్మురేపారు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఓ మ్యాచ్‌ వర్షార్పణం కాగా మిగతా నాలుగు మ్యాచ్‌లను గెలిచి 4–0తో క్లీన్‌స్వీప్‌ చేశారు. మంగళవారం జరిగిన చివరిదైన ఐదో టి20లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (38 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్‌ (31 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగడంతో భారత్‌ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది.
 

తొలుత భారత్‌ 18.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు మిథాలీ రాజ్‌ (12), స్మృతి మంధాన (0) త్వరగానే పెవిలియన్‌ చేరినా... జెమీమా, హర్మన్‌ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. అనంతరం వేద కృష్ణమూర్తి (8), అనూజ (1), తానియా (5) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లకంటే ముందే ఆలౌటైంది. లంక బౌలర్లలో శశికళ, ప్రయదర్శని ఫెర్నాండో మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం పూనమ్‌ యాదవ్‌ (3/18), దీప్తి శర్మ (2/18), రాధ యాదవ్‌ (2/14)ల ధాటికి లంక 17.4 ఓవర్లలో 105 పరుగులకే పరిమితమైంది.  

మరిన్ని వార్తలు