బామ్మ ‘బంగారం’

31 Aug, 2016 01:01 IST|Sakshi
బామ్మ ‘బంగారం’

100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగు విజేత   
వాంకోవర్:  ఒక మనిషి వందేళ్లు బతకడమే గొప్ప... బతికినా మంచంలో ముక్కుతూ, మూల్గుతూ చివరి రోజులు గడిపేయడమే మనకు సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ 100 ఏళ్ల వయసులో పరుగు పందేల్లో పోటీ పడి పతకాలు కూడా గెలుచుకోవడం మన ఊహకు కూడా అందనిది. కానీ మాన్ కౌర్ అనే శతాయుష్షు మహిళ ఈ వయసులోనూ ఏదైనా సాధించవచ్చని నిరూపించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. వివరాల్లోకెళితే... అమెరికాలో జరిగిన మాస్టర్స్ క్రీడల్లో భారత్‌కు చెందిన మాన్ కౌర్ 100 మీటర్ల స్పి్రంట్‌లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.

ఎవరో ఒకరి సహాయం లేకుండా అడుగు తీసి అడుగు వేయలేని వయసులో ఆమె 1 నిమిషం, 21 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. ఈ క్రమంలో 70నుంచి 80 ఏళ్ల వయసులో ఉన్న చాలా మందిని ఆమె వెనక్కి తోసింది. ఇదొక్కటే కాదు జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లలో కూడా కౌర్ బంగారు పతకాలు గెలుచుకోవడం మరో విశేషం! ఇదే పోటీల్లో ఆమె 78 ఏళ్ల కుమారుడు గుర్‌దేవ్ సింగ్ కూడా పాల్గొంటున్నాడు. ‘ఆమెకు మోకాలి నొప్పి, గుండె నొప్పిలాంటి ఎలాంటి సమస్యలు లేవు. కాబట్టి పరుగెత్తవచ్చు అని నేనూ ప్రోత్సహించాను.

భారత్‌కు తిరిగి వెళ్లాక నేను దేశం కోసం ఇన్ని పతకాలు గెలిచాను అని ఆమె గర్వంగా చెప్పుకుంటుంది. ఆ సమయంలో ఆమె ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము‘ అని గుర్‌దేవ్ అన్నారు. చండీగఢ్‌కు చెందిన కౌర్ ప్రపంచవ్యాప్తంగా మాస్టర్స్ పోటీల్లో ఇప్పటి వరకు 20కు పైగా పతకాలు గెలుచుకుంది.

మరిన్ని వార్తలు