ఫిక్సింగ్‌కి బౌల్డ్‌

8 Nov, 2019 08:22 IST|Sakshi
నిందితులు.. ఆటగాడు ఖాజీ ,బళ్లారి కెప్టెన్‌ గౌతం

బళ్లారి జట్టు కెప్టెన్‌ గౌతం, ఆటగాడు ఖాజీ అరెస్టు  

త్వరలో మరికొందరికీ బేడీలు  

సీసీబీ జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడి

కర్ణాటక, బనశంకరి: కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ (కేపీఎల్‌) క్రికెట్‌ పోటీల్లో బెట్టింగ్, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసును విచారణ తీవ్రతరం చేసిన బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు గురువారం బళ్లారి టస్కర్స్‌ జట్టు కెప్టెన్‌తో మరో క్రికెటర్‌ను అరెస్ట్‌ చేశారు. బళ్లారి జట్టు కెప్టెన్‌ సీఎం గౌతం, క్రికెటర్‌ అబ్రార్‌ ఖాజీని అరెస్ట్‌ చేసి విచారణ తీవ్రతరం చేశామని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌పాటిల్‌ తెలిపారు. 

రూ.20 లక్షలకు స్పాట్‌ ఫిక్సింగ్‌  
సందీప్‌ తెలిపిన మేరకు... పోలీసులకు పట్టుబడిన ఇద్దరు క్రికెటర్లు 2019 కేపీఎల్‌ టోర్నీ హుబ్లీ, బళ్లారి జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మ్యాచ్‌లో నిదానంగా బ్యాటింగ్‌ చేయడానికి వీరు బుకీలనుంచి రూ.20 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. బెంగళూరు జట్టుపై ఆడిన మరో మ్యాచ్‌లోనూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పలు జాతీయస్థాయి టోర్నీల్లో ఆడినవారే కావడం గమనార్హం. మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో సంబంధమున్న మరికొందరిని కనిపెట్టి పూర్తి ఆధారాలతో త్వరలో అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.  

షెకావత్‌ అరెస్టుతో కదిలిన డొంక  
 రెండురోజుల క్రితం మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగస్వామిగా ఉన్న బెంగళూరు బ్లాస్టర్‌ జట్టులో బ్యాట్స్‌మెన్‌ నిశాంత్‌ సింగ్‌ షెఖావత్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా అతడు ప్రముఖ బుకీలతో సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన  షెఖావత్‌ కేపీఎల్‌ మొదటి సీజన్‌ నుంచి హుబ్లీ, మంగళూరు, శివమొగ్గ జట్లతరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరు బ్లాస్టర్స్‌ జట్టులో తరపున ఆడుతూ పరారీలో ఉన్న ప్రముఖ బుకీలైన సయ్యాం, జతిన్, చండీఘడ్‌ బుకీ మనోజ్‌ కుమార్‌తో షెఖావత్‌ నిత్యం సంప్రదించేవాడు. ఇప్పటికే పోలీసులకు పట్టుబడిన బెంగళూరు బ్లాస్టర్స్‌ జట్టు బౌలింగ్‌కోచ్‌ విను ప్రసాద్, బ్యాట్స్‌మెన్‌ విశ్వనాథన్‌లకు బుకీలను పరిచయం చేసింది షెకావతే. 

మైసూరులో  
2018 ఆగస్టు 31 హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్‌ మధ్య మైసూరు శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడయార్‌ మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ లు నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు కొద్దిరోజులకు ముందు మైసూరులో ఓ హోటల్‌ బుకీ మనోజ్‌ ను నిశాంత్‌సింగ్‌ షెకావత్‌ సంప్రదించాడు. అనంతరం వినుప్రసాద్, విశ్వనాథన్‌ను పిలిపిం చి మాట్లాడారు. అప్పుడు డబ్బు చేతులు మారి ఉండవచ్చని అనుమానం ఉంది.  షెకావత్‌కు అన్ని జట్లలో కోచ్‌లు, ఆటగాళ్లతో పరిచయం ఉంది. ఇతడు బుకీలను ఆటగాళ్లకు పరిచయం చేసి దందాను విస్తరించేవాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సందీప్‌పాటిల్‌ తెలిపారు. ఢిల్లీ బుకీలైన జతిన్, సయ్యాం అరెస్ట్‌ కోసం లుక్‌అవుట్‌నోటీస్‌ విడుదల చేశామన్నారు. వారిద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో బెళగావి ప్యాంథర్స్‌ జట్టు యజమాని అష్పాక్‌ అలీతార్‌ను అరెస్ట్‌ చేయగా అతనిచ్చిన సమాచారం ఆధారంగా కేసు విచారణ తీవ్రతరం చేశామన్నారు. బళ్లారి టస్కర్స్‌ జట్టులో డ్రమ్మర్‌ భవేశ్‌ను కూడా ఫిక్సింగ్‌ కేసులో అరెస్టు చేశారు.   

ఏమిటీ: కొన్నేళ్ల క్రితం ఐపీఎల్‌ తరహాలో అట్టహాసంగా ఆరంభమైన కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో ఫిక్సింగ్, బెట్టింగ్‌ దందా
ఎలా, ఎవరు: ఓ జట్టు యజమాని, కొందరు ఆటగాళ్లు, పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు కుమ్మక్కై మ్యాచ్‌ ఫలితాలను ముందే నిర్దేశించడం.  
ఇప్పటివరకు అరెస్టయింది: బెళగావి ప్యాంథర్స్‌ జట్టు యజమాని అష్పాక్‌ అలీతార్, బెంగళూరు బ్లాస్టర్స్‌ జట్టు బౌలింగ్‌కోచ్‌ విను ప్రసాద్, బ్యాట్స్‌మెన్‌ విశ్వనాథన్, మరోఆటగాడు షెకావత్, డ్రమ్మర్‌ భవేశ్‌. పరారీలో ఉన్న ఢిల్లీ బుకీలు సయ్యాం, జతిన్‌  
ఎలా మొదలైంది: ఆటగాడు షెకావత్‌ బుకీలను ఆటగాళ్లకు పరిచయం చేసేవాడు.

మరిన్ని వార్తలు