అఫ్గానిస్తాన్‌ సంచలనం.. టీ20 సిరీస్‌ సొంతం

7 Feb, 2018 12:46 IST|Sakshi
రషీద్‌ ఖాన్‌ (ఫైల్‌ఫొటో)

మరోసారి మెరిసిన రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబీ

క్రికెట్‌లో పసికూన అఫ్గనిస్తాన్‌ మరోసంచలనం సృష్టించింది. జింబాంబ్వేను మట్టికరిపించింది. రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి కప్పు ఎగరేసుకెళ్లింది. సన్‌రైజర్స్‌ తరపున ఆడిన రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ రఫీలు స్వదేశం తరపున మరోసారి రాణించారు.

జింబాంబ్వేతో జరిగిన రెండో టీ20లో అఫ్గానిస్తాన్‌ సంచలనం నమోదు చేసింది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించి సిరీస్‌ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడిన మహమ్మద్‌ నబీ 26 బంతుల్లో 45పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాంబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అఫ్గాన్‌ బౌలర్లు జింబాంబ్వేను నిలువరించారు. ఇందులోను మరో సన్‌రైజర్స్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ మెరుగైన బౌలింగ్‌ చేశాడు. నాలుగు ఓవర్లకు 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌ సెమీస్‌ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన మరో యువ కెరటం ముజీబ్‌ జర్దాన్‌ రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

ఫిబ్రవరి 9 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందులో 5మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే సిరీస్‌ సైతం గెలిచి క్రికెట్‌లో ఉనికిని చాటాలని అఫ్గనిస్తాన్‌ ఆరాటపడుతోంది. ఇక ఇటవలే టెస్టు హోదా సంపాదించుకున్న ఈ క్రికెట్‌ పసికూన భారత్‌తో తన తొలిటెస్టు ఆడనుంది. జూన్‌ 14న బెంగుళూరులో ఈ మ్యాచ్‌ జరగనుంది.

>
మరిన్ని వార్తలు