కోహ్లి స్టయిలే వేరు!

12 Jun, 2015 08:48 IST|Sakshi
కోహ్లి స్టయిలే వేరు!

పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు తీసుకున్న వెంటనే కోహ్లి తన తొలి అడుగులోనే దూకుడు చూపించాడు. కెప్టెన్‌గా తన మొదటి నిర్ణయంతో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. ఉపఖండంలో ముగ్గురు పేసర్లతో సహా ఐదుగురు బౌలర్లతో తుది జట్టును ఎంపిక చేశాడు. దీనికోసం టెస్టు జట్టుకు వెన్నెముకలాంటి పుజారాను పెవిలియన్‌లో కూర్చోబెట్టాడు. ఇది తన ‘ముద్ర’ను చూపించే ప్రయత్నమా? లేక సేఫ్‌గా ఆడిన గేమా?
 
సాక్షి క్రీడా విభాగం : ఆటలో ఆ ఇద్దరివీ భిన్న ధ్రువాలు... ఒకరికి దూకుడు అలవాటైతే మరొకరి ఆట నిండు కుండలా ప్రశాంతం. ఒక టెస్టు మ్యాచ్‌లో వీరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే కెప్టెన్ ఏం చేయాలి? రిస్క్ ఉన్నా ‘కొత్తదనం’ గురించి ఆలోచించాలా? లేక సంప్రదాయానికి పట్టం కట్టాలా? బంగ్లాదేశ్‌తో టెస్టుకు ముందు కోహ్లికి ఎదురైన పరిస్థితి ఇది. ఈ విషయంలో తను ఎలాంటి మొహమాటాలకు పోలేదు.

ఐదో బౌలర్ కోసం చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మలలో ఒకరిని పక్కన పెట్టాల్సి వచ్చినప్పుడు టెస్టు స్పెషలిస్ట్ అని చూడకుండా పుజారాను పెవిలియన్‌కు పరిమితం చేశాడు. తాను నాయకత్వం వహించిన సిడ్నీ టెస్టులాగే మూడో స్థానాన్ని రోహిత్‌కు అప్పగించాడు. ఇది కోహ్లి తనదైన కొత్త శైలి చూపించే ప్రయత్నమా? లేక రోహిత్‌ను తప్పిస్తే వచ్చే విమర్శలనుంచి తప్పించుకోవడమా?
 కోహ్లి మనసులో ఏముందో...

 ఆస్ట్రేలియాలాంటి చోట కూడా భారత జట్టు ఎప్పుడూ ఐదుగురు బౌలర్లతో ఆడలేదు. ధోని జమానాలో అయితే అసలు దాని గురించి పెద్దగా చర్చించే అవసరం కూడా రాలేదు. సిడ్నీ టెస్టులో కెప్టెన్‌గా నలుగురు బౌలర్లనే ఆడించిన కోహ్లి బంగ్లాదేశ్ రాగానే ఒక్కసారిగా దూకుడు పెంచాలని భావించాడు. ఉపఖండంలో భారత్ ముగ్గురు పేసర్లతో ఆడటం కూడా చాలా అరుదైన విషయం.  ఈ స్థితిలో కచ్చితంగా ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌పై వేటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఓపెనర్‌గా విజయ్, ధావన్‌ల రికార్డు ప్రకారం వారిని పక్కన పెట్టడం కష్టం. తాను, రహానే, కీపర్ కచ్చితంగా ఉండాలి కాబట్టి రోహిత్, పుజారాల మధ్య పోటీ నెలకొంది. అయితే ‘నేనొచ్చాశానోచ్’ అనే సందేశం ఇవ్వడానికో లేక నా శైలి భిన్నం అని చాటుకోవడానికో కోహ్లి ఐదుగురు బౌలర్ల సూత్రం పాటించాడు. నిజంగా బంగ్లాలాంటి జట్టును ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్లు అవసరమా అనేది సందేహం.

 పుజారా అవసరం లేదా?
 ద్రవిడ్ వారసుడిగా జట్టులోకి వచ్చిన పుజారా నికార్సయిన టెస్టు బ్యాట్స్‌మన్. గంటల కొద్దీ క్రీజ్‌లో పాతుకుపోవడం, భీకరమైన కొత్త బంతి పని పట్టి తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ పని సులువు చేయడంలో అతను దిట్ట. అయితే ఇదంతా స్కోరు బోర్డులో కనిపించదు. 2014 ఆరంభంలో దక్షిణాఫ్రికా సిరీస్ మొదలు 20 ఇన్నింగ్స్‌లలో కలిపి పుజారా రెండు అర్ధ సెంచరీలతో 483 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 24.15 మాత్రమే. మూడో స్థానం ఆటగాడినుంచి ఆశించిన ప్రదర్శన మాత్రం ఇది కాదు.

అయితే టెస్టు జట్టులో అలాంటి ఆటగాడి అవసరం కూడా ఉంటుంది. ఐపీఎల్ ఆడని పుజారా కౌంటీల్లో యార్క్ షైర్ తరఫున ఆరు ఇన్నింగ్స్‌లలో 264 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. కౌంటీల్లో ఆటంటే సరిగ్గా టెస్టు మ్యాచ్‌లకు అతికిపోయే దృక్పథం ఉంటుంది కాబట్టి అతను బంగ్లాతో మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లే.  అయితే జట్టులో ప్రతీ బ్యాట్స్‌మన్ దూకుడు నేర్వాలని పదే పదే చెబుతున్న కోహ్లి... సంప్రదాయ శైలిలో ఆడే పుజారాలాంటి ఆటగాడి అవసరం ఈ టెస్టుకు లేదని  భావించాడేమో. పైగా పుజారాను తప్పించినా అతనికి పెద్దగా మద్దతు లభించదు కాబట్టి ఇది సేఫ్‌గేమ్‌లాంటిదే.

 రోహిత్‌పైనే నమ్మకం
 రోహిత్ తాను ఆడిన ఆఖరి టెస్టులో ఆసీస్‌తో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 53, 39 పరుగులు చేశాడు. తర్వాతి మ్యాచ్‌నుంచి ఒక ఆటగాడిని తప్పించేంత ఘోరమైన ప్రదర్శన ఏమీ కాదు ఇది. కాబట్టి అతను పూర్తిగా విఫలమై, మరో ఆటగాడు తనను తాను నిరూపించుకుంటే తప్ప రోహిత్‌ను తప్పించడం సరైంది కాదు. కాబట్టి సిడ్నీనుంచి ఆటోమెటిక్‌గా రోహిత్‌కు చోటు దక్కినట్లే. టెస్టుల్లో రోహిత్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. సొంతగడ్డపై తొలి రెండు టెస్టుల్లో సెంచరీల తర్వాత ఉపఖండం బయట 16 ఇన్నింగ్స్‌లలో అతని సగటు 24.93 మాత్రమే. ఎనిమిది టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలే చేశాడు.

కానీ వన్డేల్లో ఓపెనర్‌గా మారిన తర్వాత వచ్చిన దూకుడు రోహిత్ బ్యాటింగ్‌లో అన్ని ఫార్మాట్‌లలో కనిపిస్తోంది. టెస్టులకు కూడా అది అవసరమని కెప్టెన్ భావించినట్లున్నాడు. చాలా సందర్భాల్లో కోహ్లి, రోహిత్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ వచ్చాడు. ఇటీవల ఐపీఎల్ ప్రదర్శన, నాయకత్వం రోహిత్‌ను ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. కొన్ని సందర్భాల్లో భవిష్యత్తు కెప్టెన్ అంటూ ప్రశంసలు కూడా మొదలయ్యాయి. ఈ స్థితిలో రోహిత్‌ను పక్కన పెడితే కోహ్లిపై అన్ని వైపులనుంచి విమర్శలు ఎదురయ్యేవి. పూర్తి స్థాయి కెప్టెన్‌గా అప్పుడే ఇలాంటి వాటిని ఎదుర్కోవడం విరాట్‌కూ ఇష్టం ఉండదు.
 
 
 శైలి భిన్నమే: స్యామీ
 ధోనితో పోలిస్తే కెప్టెన్సీ విషయంలో కోహ్లి శైలి భిన్నంగా ఉంటుందని వెస్టిండీస్ టి20 సారథి డారెన్ స్యామీ అభిప్రాయపడ్డాడు. ‘ధోని ఎక్కువగా మాట్లాడకుండా తాను చెప్పదలుచుకుంది కూల్‌గా చెప్తాడు. కానీ కోహ్లి ప్రతి అంశంలోనూ జోక్యం చెసుకోవడాన్ని ఇష్టపడతాడు. ఐపీఎల్‌లో బెంగళూరును నడిపిన తరహాలో జాతీయ జట్టును కూడా నడిపితే కోహ్లి మంచి ఫలితాలు సాధిస్తాడు’ అని స్యామీ అన్నాడు. ఐపీఎల్‌లో స్యామి బెంగళూరు జట్టుకు ఆడాడు.

మరిన్ని వార్తలు