అమిత్ మిశ్రా అరుదైన రికార్డు

30 Oct, 2016 11:11 IST|Sakshi
అమిత్ మిశ్రా అరుదైన రికార్డు

విశాఖ: న్యూజిలాండ్ తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్నాడు. ఇక్కడ జరిగిన మ్యాచ్ లో మిశ్రా ఆరు ఓవర్లు వేయగా అందులో 2 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. కాగా, 18 పరుగులే ఇచ్చిన మిశ్రా ఐదు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. 15 ఓవర్ల వరకు పరవాలేదు అనుకున్న కివీస్ ఇన్నింగ్స్ మిశ్రా రంగంలోకి దిగాక పరిస్థితి మారిపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మిశ్రా(15 వికెట్లు) నిలిచాడు. గతంలో షేన్ వార్న్, డారెన్ గాఫ్, సునీల్ నరైన్ లు 13 వికెట్లతో ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు.

ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి కివీస్ ఆటగాళ్ల తీరు సైకిల్ స్టాండ్ ను తలపించింది. అందుకు కారణం స్పిన్నర్ మిశ్రా. 16వ ఓవర్లో రెండు వికెట్లు తీసి బ్రేక్ ఇచ్చాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి రాస్ టేలర్(19) ని, చివరి బంతికి వాట్లింగ్(0)ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్ ను ఆధిక్యంలోకి తెచ్చాడు. తన అద్బుత బంతులతో కివీస్ ఆటగాళ్లను గింగిరాలు తిప్పిన మిశ్రా.. ఆ తర్వాత నీషమ్, టీమ్ సౌథీ, సోదీలను కూడా ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనత(5/18) దక్కించుకున్నాడు. ఐదుగురు కివీస్ బ్యాట్స్ మన్ ఖాతా తెరవకుండానే డకౌట్ అవగా, అందులో ముగ్గురిని మిశ్రా పెవిలియన్ కు చేర్చాడు.

మరిన్ని వార్తలు