'రాహుల్‌ కత్తి కంటే పదునుగా ఉన్నాడు'

5 Feb, 2020 19:48 IST|Sakshi

హామిల్టన్‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే జట్టుగా ఓటమి పాలైనా టీమిండియా క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌లు మాత్రం తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. తాజాగా కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు.' ప్రసుత్తం కేఎల్‌ రాహుల్‌ కత్తి కంటే చాలా పదునుగా ఉన్నాడు. టీమిండియా జట్టులో రాహుల్‌ ఓపెనర్‌గా, వికెట్‌ కీపర్‌గా, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకున్నాడు. తాజాగా ఐదో స్థానంలో వచ్చి బెస్ట్‌ ఫినిషర్‌గా నిరూపించుకున్నాడు. ఇలా ఏ స్థానంలో ఆడినా సరే రెచ్చిపోతున్నాడు. రాహుల్‌ నీ ఆటతీరును ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నా' అంటూ కైఫ్‌ ట్వీట్‌ చేశాడు.(రాహుల్‌కు షాక్‌.. శుబ్‌మన్‌ గిల్‌ ఇన్‌..)

కేఎల్‌ రాహుల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న రాహుల్‌ ఆస్ట్రేలియా, విండీస్‌, న్యూజిలాండ్‌లతో జరిగిన సిరీస్‌లను పరిశీలిస్తే ఓపెనర్‌ స్థానం నుంచి ఐదో స్థానం వరకు ఆడాడు. రాహుల్‌ ఆడిన మ్యాచ్‌ల్లో స్థానాలు మారుతున్నాయే తప్ప తన ఆటతీరు మాత్రం విధ్వంసకరస్థాయిలోనే కొనసాగుతుంది. తాజాగా కివీస్‌ తో జరిగిన మొదటి వన్డేలో ఐదో స్థానంలో వచ్చి కేవలం 64 బంతుల్లోనే 88 పరుగులు నమోదు చేయగా, రాహుల్‌ ఇన్నింగ్స్‌ల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు భారత జట్టు రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌ గైర్హార్జీలో మొదటి వన్డేలో పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌లు ఓపెనర్లుగా రావడంతో కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానంలో రావాల్సి వచ్చింది. ఏ స్థానంలో వచ్చినా సరే తన విధ్వంసకర ఆటతీరుతో రాహుల్‌ జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. (కోహ్లిని దాటేసిన రాహుల్‌)

మరిన్ని వార్తలు