అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం.. క్రెడిట్‌ వాళ్లకే: సూర్య

2 Dec, 2023 10:41 IST|Sakshi

టీమిండియా టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి సిరీస్‌లోనే సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అటు బ్యాటర్‌గా.. ఇటు సారథిగా తన పాత్రను సమర్థవంతంగా పోషించి.. భారత జట్టుకు ట్రోఫీని అందించాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సహా కీలక ఆటగాళ్లు ఎవరూ లేకుండానే యువ జట్టుతో ఆసీస్‌పై పైచేయి సాధించగలిగాడు.

కాగా ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో గెలుపొందడం ద్వారా టీమిండియా ఓ మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. రాయ్‌పూర్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1తో సత్తా చాటింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. రింకూ సింగ్‌ 29 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ 19 బంతుల్లోనే 35 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను టీమిండియా స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయి దెబ్బకొట్టారు. అక్షర్‌ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రవి ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

మరోవైపు చాలా రోజుల తర్వాత భారత జట్టులో పునరాగమనం చేసిన పేసర్‌ దీపక్‌ చహర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్‌ ఖాన్‌ కూడా ఒక వికెట్‌ తీయగలిగాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన మాథ్యూ వేడ్‌ బృందం 154 పరుగులకే ఆట ముగించి.. భారత్‌కు సిరీస్‌ను సమర్పించుకుంది.

ఈ నేపథ్యంలో సిరీస్‌ విజయంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు టాస్‌ తప్ప అన్నీ మాకు అనుకూలంగా జరిగాయి. మా కుర్రాళ్లు పట్టుదలగా నిలబడి మ్యాచ్‌ గెలిపించారు.

వాళ్లు ఇలా బాధ్యతగా ఆడటమే మాకు అన్నిటికన్నా ముఖ్యం. మ్యాచ్‌కు ముందే మేమంతా సమావేశమైన సమయంలో.. ‘మిమ్మల్ని మీరు నిరూపించుకునే అద్భుత అవకాశం. ప్రతి ఒక్కరు భయం లేకుండా ఆడాలి’ అని చెప్పాం.

నిజానికి అక్షర్‌ పటేల్‌ను ఒత్తిడిలోకి నెట్టడం నాకెంతో ఇష్టం. ఎందుకంటే.. ఎంత ప్రెజర్‌ పెడితే అతడు అంత గొప్ప స్పెల్స్‌ వేస్తాడు. ఇక డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాం’’ ప్రణాళికను సరిగ్గానే అమలు చేశాం’’ అని సూర్య పేర్కొన్నాడు.

కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన అక్షర్‌ పటేల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మిగిలిన నామమాత్రపు మ్యాచ్‌ ఆదివారం బెంగళూరులో జరుగనుంది.

చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌ అయితేనేం! కుమారుల కోసం అలా..

మరిన్ని వార్తలు