ధోని మరో వరల్డ్ రికార్డు

7 Sep, 2017 12:05 IST|Sakshi
ధోని మరో వరల్డ్ రికార్డు

కొలంబో:శ్రీలంకతో జరిగిన దైపాక్షిక సిరీస్ ద్వారా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పలు ఘనతల్ని సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో మూడొందల మ్యాచ్ ల మైలురాయిని దాటడంతో పాటు వంద స్టంపింగ్ ల రికార్డును, అత్యధిక నాటౌట్ల రికార్డును సైతం లంక పర్యటనలో ధోని సాధించారు. అయితే ఇదంతా లంకేయులతో ఐదు వన్డేల సిరీస్ ను ఆడే క్రమంలో ధోని సాధించిన ఘనతలు. కాగా, శ్రీలంకతో బుధవారం జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ లో ధోని మరో వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు.

విదేశాల్లో అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్ గా ధోని రికార్డు నెలకొల్పారు. నిన్నటి మ్యాచ్ లో ఏంజెలో మాథ్యూస్ ను స్టంప్ అవుట్ రూపంలో ధోని అవుట్ చేశారు. దాంతో విదేశాల్లో 476 అవుట్లను ధోని సాధించాడు. తద్వారా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్(475) పేరిట ఉన్న రికార్డును ధోని బద్దలు కొట్టారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్(460) మూడో స్థానంలో ఉన్నారు.

మరొకవైపు ట్వంటీ 20ల్లో అత్యధిక అవుట్లు చేసిన రికార్డు కూడా ధోని పేరిట ఉండటం  విశేషం. ట్వంటీ 20ల్లో ధోని 67 అవుట్లు చేసి అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్(60) నిలిచాడు. ఇదిలా ఉంచితే, లంకేయులతో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ లో భాగంగా మొత్తం మ్యాచ్ ల్లో ధోని నాటౌట్ గా నిలిచారు. లంక పర్యటన పలు ఘనతలతో  ధోనికి తీపి జ్ఞాపకాలను మిగిల్చిందనే చెప్పాలి.

>
మరిన్ని వార్తలు