శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్

18 Nov, 2014 00:49 IST|Sakshi
శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌కు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఐపీఎల్-6లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ.. శ్రీనివాసన్ ఎలాంటి తప్పూ చేయలేదని తేల్చింది. ఆయన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అలాగే ఈ కేసు విచారణను అడ్డుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలిపింది.

అయితే ఓ ఐపీఎల్ ఆటగాడు లీగ్ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన విషయం శ్రీనితో పాటు మరో న లుగురు బోర్డు అధికారులకు తెలిసినా అతడిపై ఎలాంటి చర్య తీసుకోలేదని కమిటీ చెప్పింది. కానీ ఆ ఆటగాడెవరు? అతడు అతిక్రమించిన నిబంధనలు ఏమిటి? అనే విషయాలను కమిటీ వెల్లడించలేదు. నివేదికలో ఈ ఆటగాడిని మూడో నంబర్‌గా పేర్కొంది. ఈనెల 14న ఈ మొత్తం విచారణకు సంబంధించిన తుది నివేదికను కమిటీ సుప్రీం కోర్టుకు అందించిన విషయం తెలిసిందే.

వీరిలో నలుగురు అధికారుల పాత్రపై నోటీసులు కూడా జారీ చేసింది. 25 పేజీల ఈ నివేదిక సోమవారం మీడియాకు అందుబాటులోకి వచ్చింది. దీంట్లో ఆ నలుగురికి సంఖ్యలు కేటాయించారు. గురునాథ్ నంబర్‌వన్‌గా ఉండగా, రాజ్ కుంద్రా నంబర్ 11, సుందర్ రామన్ నంబర్ 12, శ్రీనివాసన్ నంబర్ 13గా ఉన్నారు.

 బుకీతో సుందర్ రామన్‌కు సంబంధం
 ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్‌కు నేరుగా బుకీతో సంబంధాలున్నాయని కమిటీ తేల్చింది. సీజన్‌లో ఓ బుకీకి రామన్ ఎనిమిది సార్లు ఫోన్ చేశాడని చెప్పింది. విచారణలో ఈ విషయాన్ని రామన్ అంగీకరించారని, అయితే తాను ఫోన్ చేసిన వ్యక్తికిబెట్టింగ్‌తో సంబంధాలున్న విషయం తెలీదని చెప్పాడని నివేదిక తెలిపింది.

‘రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న సమాచారం కూడా రామన్‌కు తెలుసు. అయితే ఇది శిక్షార్హమైన సమాచారం కాదని ఐసీసీ-ఏసీఎస్‌యూ చీఫ్ తెలిపినట్టు రామన్ విచారణలో చెప్పాడు’ అని నివేదిక పేర్కొంది.

 కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడ్డారు
 గతేడాది ఫిబ్రవరిలో కుంద్రాను బెట్టింగ్ గురించి ప్రశ్నించినప్పుడు తనకేమీ తెలీదని సమాధానమిచ్చాడని కమిటీ పేర్కొంది. ‘అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఆయన బుకీలతో టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. కుంద్రా స్నేహితుడొకరు చాలా పేరున్న పంటర్. తన తరఫున బెట్టింగ్ చేసేవాడు. మరోవైపు ఢిల్లీ పోలీసుల నుంచి కుంద్రా కేసు తమకు బదిలీ అయిన  వెంటనే రాజస్థాన్ పోలీసులు ఎలాంటి కారణం లేకుండానే హఠాత్తుగా విచారణను ఆపేశారు’ అని కమిటీ పేర్కొంది.

 గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు
 చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్‌గా కొనసాగిన గురునాథ్ మెయ్యప్పన్‌కు స్పాట్ ఫిక్సింగ్‌లో ప్రమేయం లేదని ముద్గల్ కమిటీ తెలిపింది. అయితే తను చట్టవ్యతిరేక బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్టు తేల్చింది. ‘బుకీలకు తనకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితో సంభాషణలు జరిపినట్టు ఫోరెన్సిక్ శాంపిల్ తేల్చింది. అలాగే ఆయన చెన్నై టీమ్ ప్రిన్సిపల్ అని రూఢీ అయ్యింది. అయితే తను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టుగా ఎవరూ చెప్పలేకపోయారు’ అని కమిటీ తేల్చింది.
 
 చెన్నై, రాజస్థాన్ జట్ల పరిస్థితి ప్రశ్నార్థకం!
 ఐపీఎల్ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. ముద్గల్ కమిటీ నివేదికలో వీరిద్దరికి ఆయా జట్లతో అధికారిక సంబంధాలున్నాయని తేలింది. లీగ్ నిబంధనల ప్రకారం ఏదేని జట్టు అధికారి తమ ప్రవర్తనతో ఆట ప్రతిష్టకు మచ్చ తెచ్చేట్టుగా ప్రవర్తిస్తే వారి ఫ్రాంచైజీ  రద్దు అవుతుంది.
 
 కచ్చితంగా చర్యలు ఉంటాయి: శివలాల్ యాదవ్
 బెట్టింగ్‌కు పాల్పడినట్టు కమిటీ తేల్చిన రాజ్ కుంద్రా, గురునాథ్ మెయ్యప్పన్‌లపై కఠిన చర్యలుంటాయని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఒకవేళ సుందర్ రామన్ బుకీతో మాట్లాడినట్టు సాక్ష్యాలు ఉంటే ఆయనపై కూడా చర్యలుంటాయని అన్నారు. బీసీసీఐ ఎవరినీ ఉపేక్షించదని శివలాల్ పేర్కొన్నారు.
 
 నేడు బీసీసీఐ అత్యవసర సమావేశం
 చెన్నై: ముద్గల్ కమిటీ నివేదికతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నూతన తేదీపై బీసీసీఐ అత్యవసర వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో చర్చించనున్నారు. నేడు (మంగళవారం) చెన్నైలో ఈ సమావేశం జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న ఏజీఎం జరగాల్సి ఉన్నా ముద్గల్ కమిటీ విచారణ నేపథ్యంలో నాలుగు వారాలపాటు వాయిదా వేశారు. ఇప్పుడు నిర్దిష్ట తేదీపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసన్ కూడా సమావేశానికి హాజరవుతారు.

మరిన్ని వార్తలు