‘హాకీ వరల్డ్ లీగ్’ చాంప్ నెదర్లాండ్స్

19 Jan, 2014 01:35 IST|Sakshi
‘హాకీ వరల్డ్ లీగ్’ చాంప్ నెదర్లాండ్స్

న్యూఢిల్లీ: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ 7-2 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. నెదర్లాండ్స్ తరఫున కాన్‌స్టన్‌టిన్ జోంకెర్ మూడు గోల్స్, బిల్లీ బాకెర్ రెండు గోల్స్ చేయగా... బాబ్ వూగ్, రోజర్ హాఫ్‌మన్ ఒక్కో గోల్ సాధించారు. కివీస్ జట్టుకు స్టీవ్ ఎడ్వర్డ్స్ రెండు గోల్స్ అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1తో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది.
 
  భారత్‌కు బెల్జియం ‘పంచ్’
 ఈ టోర్నీలో భారత జట్టు ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. గెలిచి ఐదో స్థానంలో నిలవాల్సిన ఈ వర్గీకరణ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు షరామామూలుగా చివరి నిమిషాల్లో గోల్స్‌ను సమర్పించుకున్నారు. దీంతో ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో కంగుతింది. ఆరంభం నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. భారత శిబిరం నుంచి ఆట 59వ నిమిషంలో తిమ్మయ్య ఫీల్డ్ గోల్ చేయడంతో సర్ధార్ సేన 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
 
 అయితే ఈ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా... బెల్జియం ఆటగాళ్లు ఫ్లోరెంట్ (67వ ని.), బూన్ (68వ ని.) వరుసగా చెరో గోల్ చేసి ఫలితాన్ని తారుమారు చేశారు. దీంతో బెల్జియం ఐదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్ నిరాశపరిచినప్పటికీ అంతర్జాతీయ హాకీ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో సర్దార్ సేన 10 నుంచి 7వ స్థానానికి ఎగబాకింది.

మరిన్ని వార్తలు