ఏనాడు ఊహించలేదు: కపిల్‌దేవ్‌

13 Sep, 2019 10:13 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ప్రశంసలు కురిపించాడు.  ప్రపంచ క్రికెట్‌లో రికార్డులు మోత మోగిస్తున్న కోహ్లిని ఆకాశానికెత్తేశాడు. ప్రధానంగా దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులను వరుస పెట్టి బ్రేక్‌ చేస్తూ వస్తున్న కోహ్లి ఒక  అసాధారణ ఆటగాడిగా అభివర్ణించాడు. అసలు సచిన్‌ రికార్డులకు ఏ ఒక్క క్రికెటర్‌ చేరువగా వస్తాడని ఏనాడు ఊహించలేదని కోహ్లిని కొనియాడాడు.

‘సచిన్‌ రికార్డులకు చేరువగా ఎవరూ వస్తారని అనుకోలేదు. ఇప్పుడు సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డుకు కోహ్లి చేరువగా వచ్చాడు. అతనికి ఇంకా చాలా కెరీర్‌ ఉంది. అతని కెరీర్‌ మధ్యలో ఉండగా ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడనే దానిపై మాట్లాడటం సరైనది కాదనేది నా అభిప్రాయం. సచిన్‌ తన శకంలో రికార్డులు మోత మోగించాడు. అదొక అద్భుతం. కాకపోతే గేమ్‌ను కోహ్లి వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కోహ్లి పరుగుల వరద సృష్టించడం  టీమిండియాకు ఒక శుభపరిణామం. కోహ్లి ఆటను చూసి నేను చాలా సంతోష పడుతున్నా.క్రికెట్‌లో అపారమైన జ్ఞానం కోహ్లి సొంతం. ఇక్కడ ఢిల్లీ క్రికెట్‌  అసోసియేషన్‌కు థ్యాంక్స్‌  చెప్పాలి’ అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు