జొకోవిచ్‌ సెవెన్‌ స్టార్‌

28 Jan, 2019 00:55 IST|Sakshi

 ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ వశం 

ఈ టోర్నీని అత్యధికసార్లు నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు

ఏకపక్ష ఫైనల్లో నాదల్‌పై ఘనవిజయం

రూ. 20 కోట్ల 87 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

తనకు ఎంతో అచ్చొచ్చిన వేదికపై ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. హోరాహోరీ పోరు ఆశించి వచ్చిన ప్రేక్షకులకు తన అద్వితీయ ఆటతీరుతో కనువిందు చేశాడు. తుది సమరాన్ని ఏకపక్షం చేసేశాడు. గతంలో ఎవరికీ సాధ్యంకానిరీతిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకొని చరిత్ర పుటల్లోకి చేరాడు. కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన రాఫెల్‌ నాదల్‌ సెర్బియా స్టార్‌ దెబ్బకు కుదేలయ్యాడు.    

మెల్‌బోర్న్‌: సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో తన అజేయ రికార్డును సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కొనసాగించాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్‌కు చేరి ఆరుసార్లూ (2008, 2011, 2012, 2013, 2015, 2016) విజేతగా నిలిచిన జొకోవిచ్‌ ఏడోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఆదివారం రాడ్‌ లేవర్‌ ఎరీనాలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6–3, 6–2, 6–3తో రెండో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లోని ఏదశలోనూ 31 ఏళ్ల జొకోవిచ్‌ జోరు ముందు 32 ఏళ్ల నాదల్‌ ఎదురు నిలువలేకపోయాడు.

2012లో చివరిసారి వీరిద్దరి మధ్య జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ 5 గంటల 53 నిమిషాలు కొనసాగగా... ఈసారి మాత్రం 2 గంటల 4 నిమిషాల్లోనే ముగిసింది. విజేత జొకోవిచ్‌కు 41 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 20 కోట్ల 87 లక్షలు)... రన్నరప్‌ నాదల్‌కు 20 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 10 కోట్ల 43 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   నాదల్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా బరిలోకి దిగిన జొకోవిచ్‌ తొలి గేమ్‌ నుంచే తన వ్యూహాన్ని అమలులో పెట్టాడు.

కచ్చితమైన సర్వీస్‌లు చేసిన అతను రెండో గేమ్‌లోనే నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. జొకోవిచ్‌ గేమ్‌ ప్లాన్‌పై అవగాహన వచ్చేలోపే నాదల్‌ తొలి సెట్‌ను కోల్పోయాడు. రెండో సెట్‌లోనూ జొకోవిచ్‌ జోరు కొనసాగగా... నాదల్‌ ప్రేక్షకుడిలా మారిపోయాడు. మూడో సెట్‌లోనూ నాదల్‌ తేరుకోవాలని చూసినా జొకోవిచ్‌ జోరు ముందు చేతులెత్తేశాడు. 

►73 జొకోవిచ్‌ సాధించిన మొత్తం అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్స్‌. గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో జొకోవిచ్, నాదల్‌ ముఖాముఖి రికార్డు 4–4

►68 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చరిత్రలో జొకోవిచ్‌ మొత్తం 76 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 68 మ్యాచ్‌ల్లో గెలిచి, ఎనిమిదింటిలో మాత్రమే ఓడిపోయాడు.  

►28కెరీర్‌లో నాదల్‌పై జొకోవిచ్‌ సాధించిన విజయాలు. నాదల్‌తో 53 సార్లు తలపడిన జొకోవిచ్‌ 28 సార్లు గెలిచి, 25 సార్లు ఓడిపోయాడు.  

►3 పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో పీట్‌సంప్రాస్‌ (అమెరికా–14)ను వెనక్కి నెట్టి జొకోవిచ్‌ (15) మూడో స్థానానికి ఎగబాకాడు. ఫెడరర్‌ (20), రాఫెల్‌ నాదల్‌ (17) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  

పురుషుల డబుల్స్‌ విభాగంలో ఐదో సీడ్‌ నికొలస్‌ మహుట్‌–పియరీ హ్యూస్‌ హెర్బర్ట్‌ (ఫ్రాన్స్‌) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో మహుట్‌–హెర్బర్ట్‌ జోడీ 6–4, 7–6 (7/2)తో 12వ సీడ్‌ హెన్రీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)–జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. ఈ విజయంతో మహుట్‌–హెర్బర్ట్‌ ద్వయం డబుల్స్‌లో కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ ఘనతను (మొత్తం నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌–ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌) పూర్తి చేసుకున్న ఎనిమిదో జోడీగా గుర్తింపు పొందింది.    

నేను ఆడిన గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో ఇదే అత్యుత్తమం. నాదల్‌పై నేను కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే. ఏడాది క్రితం మోచేతికి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత టాప్‌–20లో చోటు కోల్పోయాను. మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి గతేడాది వరుసగా వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గెలిచి ఫామ్‌లోకి వచ్చాను. ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడంతో నా అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాను.     
– జొకోవిచ్‌   

మరిన్ని వార్తలు