నంబర్‌వన్ స్థానంలో ఉన్న శ్రీలంక

7 Aug, 2013 02:24 IST|Sakshi
నంబర్‌వన్ స్థానంలో ఉన్న శ్రీలంక

 హంబన్‌టోట: టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న శ్రీలంక ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిచింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డుప్లెసిస్ (65 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), డుమిని (34 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం శ్రీలంక 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. దిల్షాన్ (51 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, జయవర్ధనే (16 బంతుల్లో 33; 7 ఫోర్లు) అతనికి సహకరించాడు. చివర్లో తిసార పెరీరా (11 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, డుమినికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.  
 
 భారీ భాగస్వామ్యం...
 మ్యాచ్ తొలి బంతికే ఓపెనర్ డేవిడ్స్ (0) అవుట్ చేసిన కులశేఖర దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. ఆ తర్వాత మెండిస్ బౌలింగ్‌లో డి కాక్ (19 బంతుల్లో 16; 3 ఫోర్లు) వెనుదిరిగాడు. ఈ దశలో జత కలిసిన డుప్లెసిస్, డుమిని భారీ షాట్లతో స్కోరును నడిపించారు. మాథ్యూస్ వేసిన ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు బాదడంతో అత్యధికంగా 15 పరుగులు వచ్చాయి. వీరిద్దరు మూడో వికెట్‌కు 73 బంతుల్లోనే 112 పరుగులు జోడించడం విశేషం.
 
 తొలి ఓవర్‌నుంచే...
 లక్ష్య ఛేదనలో శ్రీలంక దూకుడు ప్రదర్శించింది. దిల్షాన్, జయవర్ధనే చెలరేగడంతో తొలి ఓవర్లో 14, రెండో ఓవర్లో 14 పరుగులు చేసిన జట్టు పవర్ ప్లే ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు సాధించింది. జయవర్ధనేను పార్నెల్ అవుట్ చేయగా, ఆ వెంటనే కుషాల్ పెరీరా (1) వెనుదిరిగాడు. చండీమల్ (14), మాథ్యూస్ (14) కూడా ప్రభావం చూపలేకపోయారు. అయితే మరో వైపు నిలబడిన దిల్షాన్ కంగారు పడకుండా మెరుపు బ్యాటింగ్‌తో లంకను గెలిపించాడు.
 

>
మరిన్ని వార్తలు