మా ఆశలు సజీవం

29 Apr, 2017 00:56 IST|Sakshi

హ్యారీ కేన్‌ ఇంటర్వ్యూ

టొటెన్‌హామ్‌ హాట్‌స్పర్స్‌ స్టార్‌ ప్లేయర్‌ హ్యారీ కేన్‌. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌)లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఈ స్ట్రయికర్‌ తమ జట్టుకు టైటిల్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయని చెప్పాడు. అర్సెనల్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తమ సత్తా చాటుతామన్నాడు. ఈ సీజన్‌లో ఇంకా ఐదు మ్యాచ్‌లే మిగిలిండటంతో ప్రతీ మ్యాచ్‌ తమకు కీలకమన్నాడు. ఇంకా ఏమన్నాడంటే...

టైటిల్‌ రేసులో ఉన్న టొటెన్‌హామ్‌ సొంతగడ్డపై అర్సెనల్‌తో పోరుకు సిద్ధమేనా?
ఒక్క అర్సెనల్‌తో మ్యాచే కాదు. మిగతా మ్యాచ్‌ల్ని కూడా ఇప్పుడు ఒకేలా చూస్తాం. అగ్రస్థానంలో ఉన్న చెల్సీని చేరాలంటే మేం మిగిలున్న మ్యాచ్‌లన్నీ తప్పక గెలవాల్సిందే. ఇదే మా లక్ష్యం. దానిపైనే దృష్టిపెట్టాం.

మీ మ్యాచ్‌ రోజే చెల్సీ... ఎవర్టన్‌తో తలపడనుంది. దీనిపై కూడా ఓ కన్నేశారా?
నిజాయితీగా చెబుతున్నా... ఈ కీలక తరుణంలో నేను మా జట్టు ప్రదర్శనపైనే ఫోకస్‌ చేశాను. చెల్సీ పోరుపై కాదు! మాకిపుడు ఐదు మ్యాచ్‌లు క్లిష్టమైనవి. అవన్నీ గెలవడంపైనే దృష్టిసారించాం. మిగతా జట్ల సంగతి మాకు అనవసరం.

ఎఫ్‌ఏ కప్‌ సెమీఫైనల్లో చెల్సీతో ఓటమి మీ అభిమానుల మదిలో ఇంకా మెదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవుతారు?
నిజమే అది ఊహకందని ఫలితం. హోరాహోరీ సమరంలో మేం బాగా పోరాడాం. కానీ ఈసారి అలా జరగనివ్వం. అభిమానులను సంతోషపెట్టే ఫలితాల్ని సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నాం.

ఈ సీజన్‌లో మీ జట్టు టైటిల్‌ గెలుస్తుందనుకుంటున్నారా. నాటకీయంగా చెల్సీ తడబడితే మీకే ఆ అవకాశముంటుందా?
నేను చెప్పేదొక్కటే. అంత తేలిగ్గా దేన్నీ వదులుకోం. ఎవరికీ తలవంచం. గత సీజన్‌ గుణపాఠాలతో ఈ లీగ్‌లో పటిష్టమైన స్థితిలో నిలవాలనుకుంటున్నాం. దీని కోసం ఒక్కో మ్యాచ్‌ గెలవడమే మా లక్ష్యం.

ఇప్పటికే 26 గోల్స్‌ చేసిన మీరు ఎవర్టన్‌ ఆటగాడు రొమెలు లుకాకు (30 గోల్స్‌)ను అధిగమించాలనుకుంటున్నారా?
ఇందులో సందేహమే లేదు. టాప్‌ స్కోరర్‌గా నిలవాలని ఎవరికుండదు? ఓ స్ట్రయికర్‌గా ఆ స్థానం దక్కాలనే కోరుకుంటా. కానీ లుకాకు చాలా బాగా ఆడుతున్నాడు. నేను ఇంకాస్త మెరుగ్గా ఆడితేనే ఆ ఛాన్స్‌ ఉంటుంది.

>
మరిన్ని వార్తలు