రెండో వన్డేలో పాక్‌ గెలుపు

1 Oct, 2019 09:29 IST|Sakshi

కరాచీ: నాలుగేళ్ల తర్వాత పాక్‌ గడ్డపై జరిగిన అంతర్జాతీయ వన్డేలో ఆతిథ్య దేశం గెలిచింది. తొలి వన్డే వర్షార్పణమవగా... సోమవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ 67 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. మొదట పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 305 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (115; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ, ఫకర్‌ జమన్‌ (54; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించారు. హరిస్‌ సొహైల్‌ (40; 1 ఫోర్‌) మెరుగ్గా ఆడాడు. హసరంగ డిసిల్వాకు 2 వికెట్లు దక్కాయి.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 46.5 ఓవర్లలో 238 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒక దశలో 28 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లంకను షెహన్‌ జయసూర్య (96; 7 ఫోర్లు, 1 సిక్స్‌), షనక (68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. తర్వాత టెయిలెండర్లలో హసరంగ డిసిల్వా (28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించాడు. పాక్‌ బౌలర్‌ ఉస్మాన్‌ షిన్వారి (5/51) నిప్పులు చెరిగాడు. బుధవారం ఆఖరి వన్డే కూడా ఇక్కడే జరుగనుంది.  

మరిన్ని వార్తలు