ఈ 'స్ఫూర్తి' సరిపోదా ...మనం గెలవడానికి

16 Sep, 2016 00:32 IST|Sakshi
ఈ 'స్ఫూర్తి' సరిపోదా ...మనం గెలవడానికి

భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఎందుకిచ్చాడు...?
అనుకుంటూ నిద్రలేచే వాళ్లు కోకొల్లలు.


అసలు నాకు అదృష్టమే లేదు...
ఏ చిన్న వైఫల్యం ఎదురైనా బాధపడేవాళ్లు కొందరు.


మా నాన్న నాకు ఇంకొంచెం ఇచ్చి వుంటేనా...!
నేనంటే ఏంటో చూపించేవాడిని...! ఇలా తృప్తిపడేవాళ్లు మరికొందరు.


అమ్మ నచ్చిన టిఫిన్ చేసి పెట్టలేదని ఎగిరేవాడొకడు...
నాన్న స్పోర్‌‌ట్స బైక్ కొనివ్వలేదని అలిగేవాడు ఇంకొకడు...


ఉద్యోగం రావడం లేదని వ్యవస్థనే ద్వేషించేవాడు వేరొకడు...
టీవీ రిమోట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకునేవాడొకడు...


వీళ్లంతా ఎవరు..? మనం... అవును మనమే. మనలోనే చాలామంది నిత్యం అసంతృప్తితో రగిలిపోతూ... బద్దకంగా రోజులు గడుపుతూ... విధిని తిట్టుకుంటూ... నిస్సారంగా ‘బతికేస్తున్నాం’. ఇలాంటి ‘మనం’ అందరం వీళ్లని చూసి స్ఫూర్తి పొందుదాం.

ఏదో ఒక లోపంతోనో, విధి వైపరీత్యం వల్లో వైకల్యం పొందిన వీళ్లంతా ప్రపంచానికి స్ఫూర్తిని ఇస్తున్నారు. రియోలో పారాలింపిక్స్ వేదికగా తమ అద్భుత విన్యాసాలతో, పోరాటపటిమతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నారు.

రెండు చేతులూ లేకపోయినా నోటితో బ్యాట్ పట్టుకుని టేబుల్ టెన్నిస్ ఆడే యోధుడు ఒకరు... రెండు కాళ్లూ లేకపోయినా బ్లేడ్‌లతోనే రాకెట్ వేగంతో పరిగెత్తే అథ్లెట్ మరొకరు... తనకంటే మూడింతలు పొడవున్న ‘ఈటె’ను అల్లంత దూరం విసిరే వీరుడు ఇంకొకరు...

ఒక్కరా... ఇద్దరా... 4,350 మంది అథ్లెట్లు రియో వేదికగా ‘గెలుస్తున్నారు’. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దుగా ఎదగొచ్చని నిరూపిస్తున్నారు. ప్రపంచాన్ని గెలిచేందుకు కావలసిన ‘స్ఫూర్తి’ని ఇస్తున్నారు. వాళ్లకు సలామ్ చేసి ఊరుకుందామా..! వాళ్ల స్ఫూర్తితో మనం కూడా గెలుద్దామా..!  
 

మరిన్ని వార్తలు