పక్షవాతం నుంచి పతకం దాకా....

26 Jul, 2014 17:43 IST|Sakshi
పక్షవాతం నుంచి పతకం దాకా....
సరిగ్గా ఏడాది క్రితం ఆయనకు పక్షవాతం వచ్చింది. ముఖం, ముఖ్యంగా నోరు వంకర పోయింది. ఒక కన్ను కూడా వంకరపోయింది. దాన్ని బెల్స్ పాల్సీ అంటారు. దాంతో ఆయన ప్రపంచం ఉన్నట్టుండి కుప్పకూలిపోయినట్టయింది. ఆయన జీవితమే మారిపోయింది. 
కానీ ఆయనలోకి క్రీడా స్ఫూర్తి, పట్టుదల ఓటమిని అంగీకరించవద్దని చెప్పింది. తండ్రి పాపన్న కూడా అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని గెలవమని ప్రోత్సహించాడు. దాంతో ఆయన పోరాటాన్ని కొనసాగించాడు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి కామన్వెల్త్ ఆటల పోటీల్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో పాల్గొన్నాడు. పాల్గొనడమే కాదు రజత పతకాన్నీ గెలుచుకున్నాడు. అతనే భారత్ కి చెందిన షూటర్ ప్రకాశ్ నంజప్ప. బెంగుళూరుకు చెందిన ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 198.2 పాయింట్లు సాధించి, రెండో స్థానంలో నిలుచున్నారు. పతకం పొందటమే కాదు మన జాతీయ పతాకం గ్లాస్గోలో రెపరెపలాడేలా చేశాడు ప్రకాశ్ నంజప్ప.
 
ప్రకాశ్ నంజప్ప తండ్రి కూడా జాతీయ స్థాయి షూటర్. ప్రకాశ్ 2003 లో ఆట నుంచి బ్రేక్ తీసుకుని ఆరేళ్ల పాటు కెనడాలో ఉద్యోగం చేశాడు. 2009 లో మళ్లీ తిరిగి వచ్చి షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పుడు పక్షవాతం నుంచి పతకం దాకా ఎదిగి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు. 
మరిన్ని వార్తలు