సింధు జోరు...

16 Sep, 2017 00:42 IST|Sakshi
సింధు జోరు...

కొరియా ఓపెన్‌ సెమీస్‌లోకి భారత స్టార్‌
క్వార్టర్స్‌లో మితానిపై గెలుపు
నేడు చైనా క్రీడాకారిణి హి బింగ్‌జియావోతో పోరు
సెమీఫైనల్స్‌ ఉదయం గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం


సియోల్‌: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ సింధు 21–19, 16–21, 21–10తో ప్రపంచ 19వ ర్యాంకర్‌ మినత్సు మితాని (జపాన్‌)పై కష్టపడి గెలిచింది. రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై సంచలన విజయం సాధించిన మినత్సు అదే జోరును సింధుపై కనబర్చలేకపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే లభించింది. రెండో గేమ్‌లో తడబడిన ఈ తెలుగు తేజం నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం చెలరేగిపోయింది. ఆరంభంలోనే వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచిన సింధు 9–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించిన సింధు గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

శనివారం జరిగే సెమీఫైనల్లో ఆరో సీడ్‌ హి బింగ్‌జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3–5తో వెనుకబడి ఉంది. మరో సెమీఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్‌)తో అకానె యామగుచి (జపాన్‌) ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ... డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ 22–20, 10–21, 13–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సన్‌ వాన్‌ హో (కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సమీర్‌ తొలి గేమ్‌ను గెలిచినా... ఆ తర్వాత డీలా పడ్డాడు. ఈ గెలుపుతో ఈ ఏడాది ఇండియా ఓపెన్‌లో సమీర్‌ వర్మ చేతిలో ఎదురైన పరాజయానికి సన్‌ వాన్‌ హో బదులు తీర్చుకున్నాడు. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ –చిరాగ్‌ ద్వయం 14–21, 21–17, 21–15తో మూడో సీడ్‌ తకెషి కముర–కిగో సొనోడా (జపాన్‌) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.  

మరిన్ని వార్తలు