పునరాగమనంలో మాజీ చాంపియన్‌

3 Apr, 2018 00:49 IST|Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌... ఐపీఎల్‌ మొదటి సీజన్‌ సంచలన విజేత... బెట్టింగ్‌ ఆరోపణలతో మధ్యలో రెండేళ్ల నిషేధం... ఈసారి వేలంలో ఉనాద్కట్, కృష్ణప్ప గౌతమ్‌లపై భారీ వెచ్చింపు... కెప్టెన్‌గా ఎంచుకున్న స్టీవ్‌ స్మిత్‌ అనూహ్యంగా దూరం ...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు ఈ జట్టు సొంతం. అనామకులైన ఆటగాళ్లతోనే ఫలితాలు రాబట్టడం రాయల్స్‌ ఒకప్పటి శైలి. అయితే... పునరాగమనంలో దీనికి కొంత భిన్నంగా పేరున్నవారినే తీసుకుంది. టీమిండియా ఆటగాడు అజింక్య రహానే సారథ్యంలో మరి అందుకుతగ్గ ఫలితాలు సాధిస్తుందో లేదో చూడాలి

సాక్షి క్రీడా విభాగం:  బెన్‌ స్టోక్స్‌ (రూ.12.5 కోట్లు), జైదేవ్‌ ఉనాద్కట్‌ (రూ.11.5 కోట్లు) ఐపీఎల్‌–11 వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ, స్వదేశీ ఆటగాళ్లు. వీరిద్దరినీ రాయల్సే సొంతం చేసుకుంది. రూ.20 లక్షల కనీస విలువ ఉన్న అన్‌క్యాప్డ్‌ కృష్ణప్ప గౌతమ్‌ను ఏకంగా రూ.6.2 కోట్లకు తీసుకుని ఆశ్చర్యపర్చింది. రహానే, స్టోక్స్, జోస్‌ బట్లర్‌ తప్ప స్టార్లు లేనందున జట్టుగా చూస్తే పెద్దగా ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. అయితే... తన సారథ్యంలో తొలి సీజన్‌లో విజేతగా నిలిపిన షేన్‌ వార్న్‌ మళ్లీ మెంటార్‌గా వచ్చాడు. అతడి వ్యూహాలు ఫలిస్తే రాయల్స్‌ అంచనాలను మించి రాణించినా ఆశ్చర్యం లేదు. మరోవైపు జట్టు బ్యాటింగ్‌లో మెరుగ్గా ఉన్నా, బౌలింగే బలహీనంగా కనిపిస్తోంది. పేసర్లు ఉనాద్కట్, ధవళ్‌ కులకర్ణిల రాణింపు, వీరికి స్టోక్స్, గౌతమ్‌ వంటి ఆల్‌రౌండర్ల ప్రతిభ తోడైతేనే విజయావకాశాలు మెరుగుపడతాయి. వేలం సందర్భంగా గరిష్ట ఆటగాళ్ల సంఖ్య (25)కు ఇద్దరిని తక్కువగానే ఎంచుకుంది ఈ జట్టు. 

ఆ లోటు రహానేనే తీర్చాలి... 
సారథిగా నడిపిస్తాడనుకున్న స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ ట్యాంపరింగ్‌తో దూరమవడం జట్టుకు పెద్ద దెబ్బ. బ్యాటింగ్, కెప్టెన్సీలో ఈ లోటును రహానేనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఓపెనర్‌గా వచ్చే అవకాశమున్న అతడు మంచి పునాది వేయాలి. దీంతోపాటు మంచి హిట్టర్లైన సంజు శామ్సన్, రాహుల్‌ త్రిపాఠి, జోస్‌ బట్లర్, డార్సీ షాట్‌ వంటి వారు సత్తాచాటితే భారీ స్కోరు నమోదు చేయడం ఖాయం. ఇటీవలి పర్యటనలో భారత్‌పై దక్షిణాఫ్రికాను రెండు మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించిన హెన్రిక్‌ క్లాసెన్‌... స్మిత్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఇతడు చెలరేగితే మ్యాచ్‌ ఫలితమే మారిపోతుంది. ప్రస్తుత ఫామ్, ఆటతీరు బట్టి చూస్తే క్లాసెన్‌పై ఆశలు పెట్టుకోవచ్చనిపిస్తోంది. 

అందరి సత్తాకు పరీక్షే 
రాయల్స్‌ ఆటగాళ్లలో ఎక్కువ మందికి ఈ సీజన్‌ పరీక్షలాంటిది. భారత వన్డే జట్టులో సుస్థిర చోటుకు, టి20లకూ తగినవాడినే అని చెప్పేందుకు రహానేకు, నైట్‌ క్లబ్‌ వివాదంతో కోల్పోయిన ప్రతిష్ఠను ఆటతో తిరిగి పొందేందుకు స్టోక్స్‌కు, భారీ మొత్తం పలికిన ఉనాద్కట్‌కు, మళ్లీ జాతీయ జట్టు తలుపు తట్టేందుకు సంజూకు ఇది ఓ అవకాశం. మరి వీరిలో ఎవరు తమను తాము నిరూపించుకుంటారో? 

వీరు ఆసక్తికరం... 
జోఫ్రా ఆర్చర్‌... ఇంగ్లండ్‌కు చెందిన ఇతడికి అత్యంత వేగవంతమైన పేసర్‌గా పేరుంది. రూ.7.2 కోట్లు పలికిన ఆర్చర్‌కు భారత్‌లోని పిచ్‌లపై బౌలింగ్‌ చేయడం సవాలే. ఇక బడా పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన ఆర్యమాన్‌ బిర్లా, అఫ్గానిస్తాన్‌ ‘చైనామన్‌ బౌలర్‌’ జహీర్‌ ఖాన్‌లను రాయల్స్‌ వరుసగా రూ.30 లక్షలు, రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. వీరికి తుది జట్టులో చోటు కష్టమే అయినా, ఆడిస్తే అది కొంత ఆసక్తికరమే అవుతుంది. 

సొంతగడ్డ బలం 
నాలుగేళ్లుగా జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది బీసీసీఐ ఎత్తివేసింది. దీంతో రాయల్స్‌ జట్టుతో పాటు స్టేడియమూ పునరాగమనం చేస్తున్నట్లయింది. జైపూర్‌లో ఆడనుండటం కొంత బలమేనని కెప్టెన్‌ రహానే ఇప్పటికే చెప్పాడు. ఈ అనుకూలతను రాయల్స్‌ గెలుపునకు సోపానంగా మలుచుకోవాలి. 

నిలకడలేమి ప్రదర్శన... 
తొలి సీజన్‌ విజేతగా నిలిచిన తర్వాత రాయల్స్‌ మరెప్పుడూ ఆ స్థాయి ప్రదర్శనను అందుకోలేదు. వరుసగా నాలుగేళ్ల పాటు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. 2013లో ప్లే ఆఫ్స్‌ చేరినా, తర్వాతి ఏడాది మళ్లీ లీగ్‌లోనే చేతులెత్తేసింది. మళ్లీ 2015లో ప్లే ఆఫ్స్‌కు వచ్చింది. బెట్టింగ్‌ ఆరోపణల నేపథ్యంలో 2016, 2017లలో ఐపీఎల్‌కు దూరమైంది. ఓవరాల్‌గా ఎనిమిది సీజన్లలో మొత్తం 116 మ్యాచ్‌లాడి 59 మ్యాచ్‌ల్లో గెలిచింది. 53 ఓడిపోయింది. నాలుగింటిలో ఫలితాలు రాలేదు. విజయ శాతం 50.86.

ఇదీ జట్టు
స్వదేశీ: రహానే (కెప్టెన్‌), సంజు, రాహుల్‌ త్రిపాఠి, కె.గౌతమ్, ధవళ్‌ కులకర్ణి, ఉనాద్కట్, అంకిత్‌ శర్మ, అనురీత్‌ సింగ్, శ్రేయస్‌ గోపాల్, సుధేశన్‌ మిథున్, ప్రశాంత్‌చోప్రా, మహిపాల్‌ లోమ్రర్, జతిన్‌ సక్సేనా, ఆర్యమాన్‌ బిర్లా, స్టువర్ట్‌ బిన్నీ 
విదేశీ: క్లాసెన్, స్టోక్స్, బట్లర్, ఆర్చర్, డార్సీ షార్ట్, జహీర్‌ ఖాన్, బెన్‌ లాలిన్, చమీర.  

మరిన్ని వార్తలు