లాహోర్ అయితే మాకు ఓకే: రాజీవ్ శుక్లా

21 Nov, 2015 20:18 IST|Sakshi
లాహోర్ అయితే మాకు ఓకే: రాజీవ్ శుక్లా

ముంబై: పాకిస్థాన్-టీమిండియాల మధ్య వచ్చే నెలలో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ యూఏఈలో జరుగుతుందా?లేక భారత్ లో నిర్వహిస్తారా?అనే సందిగ్ధత ఒకపక్క.. అసలు ఈ సిరీస్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంతవరకూ ముందుకు వెళుతుందనేది మరోపక్క. ఇప్పటివరకూ ఓ సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్న. కాగా, వీటిన్నంటికీ తెరదించుతూ కొత్త పల్లవి అందుకున్నారు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా. అసలు ఇరు దేశాల మధ్య జరగాల్సిన సిరీస్ ను యూఏఈలో నిర్వహించడం అనవసరం అని శుక్లా కుండబద్దలు కొట్టారు . ఆ సిరీస్ ను నేరుగా పాకిస్థాన్ లో నిర్వహిస్తే బాగుంటుందన్నారు. దీనికి లాహోర్ వేదికైతే ఎలా ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును (పీసీబీ) కి విజ్ఞప్తి చేశారు.

 

'పాకిస్థాన్ లో జరగాల్సిన హోం సిరీస్ ను యూఏఈలో నిర్వహించడం కూడా పీసీబీకి అంతగా సబబు కాదు. ఒకవేళ పాకిస్థాన్ తమ స్వదేశీ సిరీస్ లను ఇలానే బయట నిర్వహిస్తే వారు మెల్లగా మెల్లగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. మేము లాహోర్
లో అయితే క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. మాకు పటిష్టమైన భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలి. మా ఆటగాళ్లకు భద్రతా పరంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి హామీ వస్తే లాహూర్ లో ఆడతాం' అని శుక్లా తెలిపారు. పాకిస్థాన్ తో అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడటానికి తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఈ సందర్భంగా శుక్లా పేర్కొన్నారు. యూఏఈలో సిరీస్ లో భాగంగా దుబాయ్ లో మ్యాచ్ నిర్వహణకు తమకు కొన్ని అడ్డంకులు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు వెళ్లి సిరీస్ ఆడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు