13 ఏళ్ల 9 నెలల 28 రోజుల్లో...

21 Oct, 2019 03:09 IST|Sakshi

భారత 65వ గ్రాండ్‌మాస్టర్‌గా రౌనక్‌ సిధ్వాని

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి చెస్‌లో మరో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అవతరించాడు. నాగ్‌పూర్‌కు చెందిన రౌనక్‌ సిధ్వాని భారత 65వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీన తొమ్మిదో రౌండ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్‌ అలెగ్జాండర్‌ మోతిలెవ్‌పై రౌనక్‌ 37 ఎత్తుల్లో గెలిచి జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను ఖాయం చేసుకున్నాడు. రౌనక్‌ ఖాతాలో ఇప్పటికే రెండు జీఎం నార్మ్‌లు ఉండటం... తాజా ప్రదర్శనతో అతని రేటింగ్‌ పాయింట్లు 2500 దాటనుండటంతో అతనికి జీఎం హోదా ఖాయమైంది.

ఈ క్రమంలో రౌనక్‌ చెస్‌ చరిత్రలో పిన్న వయస్సులో (13 ఏళ్ల 9 నెలల 28 రోజులు) జీఎం హోదా పొందిన ఏడో ప్లేయర్‌గా, భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ప్రపంచ చెస్‌లో పిన్న వయస్సులో జీఎం హోదా పొందిన ప్లేయర్‌ రికార్డు సెర్గీ కర్జాకిన్‌ (రష్యా–12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది. ఈ జాబితాలో భారత్‌ నుంచి డి.గుకేశ్‌ (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు), ప్రజ్ఞానంద (12 ఏళ్ల 10 నెలల 13 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.   

మరిన్ని వార్తలు