రోహితారాజువ్వ

7 Nov, 2018 01:23 IST|Sakshi

అజేయ శతకంతో చెలరేగిన హిట్‌మ్యాన్‌ 

రెండోటి20లో  భారత్‌ ఘనవిజయం

సిరీస్‌ 2–0తో కైవసం

71 పరుగుల తేడాతో విండీస్‌ చిత్తు

అతడి ధాటైన ఆటకు పెద్ద మైదానం చిన్నబోయింది. 50 వేల మందితో నిండిన స్టేడియం హోరెత్తింది. లాంగాఫ్, లాంగాన్‌లో రాకెట్లలాంటి సిక్స్‌లను చూసి మిన్నంటింది. మిడాన్‌లో చిచ్చుబుడ్డిలా ఎగసిన షాట్లకు మురిసిపోయింది. కవర్స్, పాయింట్‌ దిశగా కొట్టిన బౌండరీలతో మతాబులా వెలిగిపోయింది. ప్రేక్షకులు, అభిమానులకు దీపావళి ఒక రోజు ముందే వచ్చినట్లైంది. వెరసి... రోహిత్‌ శర్మ సొగసైన ఇన్నింగ్స్‌కు మరో శతకం దాసోహమైంది. భారత్‌కు విజయం...విండీస్‌ కు పరాజయం  ఖాయమైంది.  

లక్నో: రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను నిదానంగా మొదలు పెట్టాడంటే, అది కచ్చితంగా తుపానుకు ముందు ప్రశాంతతే అనుకోవాలి! మరో భారీ స్కోరుకు క్రీజులో బలమైన పునాది వేస్తున్నాడని భావించాలి! తానేదో బీభత్సం సృష్టించబోతున్నాడని అర్థం చేసుకోవాలి! అతడి రికార్డులు, ఘనతలు చూసి అద్భుతం చేయబోతున్నాడని ఊహించాలి! మంగళవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన రెండో టి20లో సరిగ్గా ఇవన్నీ అలా... అలా... ఓ కలలా సాగిపోయాయి. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ (61 బంతుల్లో 111 నాటౌట్‌; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) బ్యాట్‌ నుంచి హీరోచిత శతకం జాలువారిన వేళ... టీమిండియా వెస్టిండీస్‌ను 71 పరుగుల తేడాతో చిత్తు చేసి మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. కెప్టెన్‌ విధ్వంసానికి ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (14 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచారు. ఫలితంగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కుర్ర పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ (2/30)... ‘చైనామన్‌’ కుల్దీప్‌ యాదవ్‌ (2/32) ధాటికి ఛేదనలో విండీస్‌ ముందే కుదేలైంది. భువనేశ్వర్‌ (2/12), బుమ్రా (2/20) దెబ్బకు 124/9 వద్దే ఆగిపోయింది. డారెన్‌ బ్రావో (23) స్కోరే అత్యధికం కావడం ఆ జట్టు ప్రదర్శనను చెబుతోంది. రోహిత్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌ ఈ నెల 11న చెన్నైలో జరుగుతుంది. 

ధావన్‌ నిలిచాడు... రోహిత్‌ దంచాడు 
ఒషాన్‌ థామస్‌ బుల్లెట్‌ బంతులను కాచుకుంటూ ఇన్నింగ్స్‌ను ఆచితూచి ప్రారంభించారు రోహిత్, ధావన్‌. దీంతో తొలి 4 ఓవర్లలో 20 పరుగులే వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో మాత్రం థామస్‌కు చుక్కలు చూపారు. 149 కి.మీ. వేగంతో అతడు వేసిన బంతిని రోహిత్‌ మిడాఫ్‌లో అద్భుత సిక్స్‌ కొట్టగా, ధావన్‌ రెండు ఫోర్లతో బ్యాట్‌కు పని చెప్పాడు. ఇక్కడి నుంచి స్కోరు వేగంగా ముందుకుసాగింది. పియర్, బ్రాత్‌వైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఓపెనర్లు చెలరేగారు. ఈ క్రమంలో అలెన్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు, బ్రాత్‌వైట్‌ ఓవర్లో ధావన్‌కు లైఫ్‌లు లభించాయి. దీనిని సద్వినియోగం చేసుకుని 38 బంతుల్లో అర్ధశతకం అందుకున్న కెప్టెన్‌... అప్పటివరకు కట్టడి చేసిన అలెన్‌కు 14వ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో తడాఖా చూపాడు. అయితే, చివరి బంతికి పూరన్‌ చక్కటి క్యాచ్‌ పట్టడంతో ధావన్‌ వెనుదిరిగాడు. దీంతో 123 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసే ఉద్దేశంతో రిషభ్‌ పంత్‌ (5)ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపినా అతడు విఫలమయ్యాడు.

రాహుల్‌ ఫటాఫట్‌ షాట్లతో బౌండరీలు బాదాడు. ఓ చూడముచ్చటైన స్ట్రయిట్‌ సిక్స్‌ కొట్టాడు. మరో ఎండ్‌లో పియర్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్, థర్డ్‌మ్యాన్‌ దిశగా ఒంటిచేత్తో ఫోర్‌ కొట్టిన రోహిత్‌ 90ల్లోకి వచ్చాడు. కానీ, కీమో పాల్‌ 19వ ఓవర్‌ను పొదుపుగా వేయడం, ఆఖరి బంతికి రాహుల్‌ సింగిల్‌ తీయడంతో... హిట్‌మ్యాన్‌ సెంచరీ పూర్తవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. రాహుల్‌ 20వ ఓవర్‌ మొదటి బంతికి పరుగు తీసి రోహిత్‌కు స్ట్రయికింగ్‌ వచ్చేలా చూశాడు. అంతే, ఏమాత్రం సంకోచం లేకుండా రెండు వరుస బౌండరీలతో అతడు శతకం (58 బంతుల్లో) అందుకున్నాడు. 50 నుంచి 100కు చేరుకోవడానికి రోహిత్‌కు 20 బంతులే పట్టడం విశేషం. మరుసటి బంతికి షాట్‌ను అడ్డుకున్న బ్రాత్‌వైట్‌... వికెట్లకేసి విసిరే యత్నంలో ఓవర్‌ త్రో రూపంలో రోహిత్‌ ఖాతాలో నాలుగు పరుగులు జమ చేశాడు. ఆ వెంటనే రోహిత్‌ లాంగాఫ్‌లోకి సిక్స్‌ కొట్టాడు. ఈ ఓవర్లో 20 పరుగులు రావడంతో భారత్‌ ఊహించిన దానికంటే ఎక్కువే స్కోరు చేయగలిగింది. 

విండీస్‌ విధి రాతంతే... 
భారీ లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలో దిగిన విండీస్‌కు యువ పేసర్‌ ఖలీల్‌ షాకిచ్చాడు. ఓపెనర్లు షై హోప్‌ (6), హెట్‌మైర్‌ (15)ను ఔట్‌ చేసి ఆ జట్టుకు మ్యాచ్‌పై ఆశలు లేకుండా చేశాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో డారెన్‌ బ్రావో స్లిప్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో పోరాడే వారే లేకపోయారు. రామ్‌దిన్‌ (10), పూరన్‌ (4), పొలార్డ్‌ (6)లకు క్రీజులో నిలవడమే గగనమైంది.   

ఆ క్యాచ్‌లే పట్టి ఉంటే... 
ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 27 పరుగుల వద్ద ఉండగా అలెన్‌ రిటర్న్‌ క్యాచ్‌ను జారవిడిచాడు. శిఖర్‌ ధావన్‌ 28 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మిడ్‌ వికెట్‌లో కీమో పాల్‌ వదిలేశాడు. ఈ రెండింటిని పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంతేకాక, 19వ ఓవర్లో రాహుల్‌ క్యాచ్‌ను పొలార్డ్‌ అందుకోలేకపోయాడు. 

►భారత్‌ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ (2,203) ఘనత వహించాడు. కోహ్లి (2,102 పరుగులు) రెండో స్థానానికి పడిపోయాడు.  

►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రోహిత్‌ శర్మ (96) రెండో స్థానానికి చేరాడు. గేల్, గప్టిల్‌ (103 చొప్పున)  అగ్రస్థానంలో ఉన్నారు. 

►భారత జట్టుకిది  వరుసగా ఏడో టి20 సిరీస్‌   విజయం.  ఈ ఏడింటిలో నాలుగు విదేశాల్లో, మూడు స్వదేశంలో వచ్చాయి. 

►అంతర్జాతీయ టి20ల్లో అత్యధికంగా నాలుగు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ గుర్తింపు పొందాడు.  ఈ జాబితాలో మున్రో (న్యూజిలాండ్‌–3 సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు. 

>
మరిన్ని వార్తలు