ఫెడరర్‌.. మరింత గౌరవం పెరిగింది : సచిన్‌

21 Jan, 2019 16:09 IST|Sakshi

ముంబై : స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌పై మరింత గౌరవం పెరిగిందని భారత క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. గత శనివారం ఆస్ట్రేలియా ఓపెన్‌లో అక్రిడేషన్‌ పాస్‌ మర్చిపోయిన రోజర్‌ ఫెడరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లనీయకుండా అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్‌ తన అధికారిక ట్విటర్‌లో ‘ఫెడరర్‌కు కూడా అక్రిడేషన్‌ కావాల్సిందే’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. అయితే ఈ వీడియోను రీట్వీట్‌ చేస్తూ సచిన్‌ ఈ ఘటనపై స్పందించారు. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం చూసేందుకు చాలా బాగుంది. అదే సమయంలో ఫెడరర్ స్పందించిన తీరు కూడా అద్భుతం. ఇలాంటి సన్నివేశాలు ఈ రోజుల్లో చాలా అరుదు. ఇలాంటి వాటితో ఫెడరర్ వంటి గొప్ప అథ్లెట్‌పై మరింత గౌరవం పెరుగుతుంది’ అని ట్వీట్ చేశాడు.

అక్రిడేషన్ పాస్ లేకపోవడంతో ఫెడరర్ తన సహాయ సిబ్బంది వచ్చే వరకు అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అందరితో పాటే రోజర్ ఫెడరర్ ఓపికగా నిలబడగా.. ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత గానీ ఫెడరర్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు లోపలికి అనుమతిచలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్లో నిలిపేశారు.

ఇక ఈ స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యువ ఆటగాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతర్జాతీయస్థాయిలో తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్‌ యువతార స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో ఫెడరర్‌ కంగుతిన్నాడు. వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్‌ స్టార్‌కు... కెరీర్‌లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్‌ ఆడుతోన్న సిట్సిపాస్‌ ఊహించని షాక్‌ ఇచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 14వ సీడ్‌ సిట్సిపాస్‌ 6–7 (11/13), 7–6 (7/3), 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్‌ ఫెడరర్‌పై గెలిచి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు