‘పసిడి గురి’ అదిరింది

16 Feb, 2016 00:46 IST|Sakshi
‘పసిడి గురి’ అదిరింది

షూటింగ్‌లో మరో నాలుగు స్వర్ణాలు  
* బాక్సింగ్‌లో క్లీన్‌స్వీప్  
* దక్షిణాసియా క్రీడలు

గువాహటి: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో మళ్లీ స్వర్ణ పతకాల మోత మోగించారు. సోమవారం ఒక్కరోజే భారత్‌కు 26 పసిడి పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 181 స్వర్ణాలు, 88 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి మొత్తం 299 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. నేటితో (మంగళవారం) దక్షిణాసియా క్రీడలకు తెరపడనుంది.
 
షూటింగ్ ఈవెంట్ చివరి రోజు భారత్ నాలుగు స్వర్ణాలను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా షూటింగ్‌లో భారత్‌కు 25 స్వర్ణాలు లభించడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో శ్వేతా సింగ్ (194.4 పాయింట్లు) పసిడి నెగ్గగా... హీనా సిద్ధూ (192.5 పాయింట్లు) రజతం, యశస్విని సింగ్ (171.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో శ్వేతా, హీనా, యశస్వినిలతో కూడిన భారత జట్టు 1133 పాయింట్లతో బంగారు పతకాన్ని దక్కించుకుంది.

పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో గుర్‌ప్రీత్ సింగ్ (28 పాయింట్లు) స్వర్ణం సాధించగా... విజయ్ కుమార్ (20 పాయింట్లు) కాంస్యం నెగ్గాడు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో గుర్‌ప్రీత్ సింగ్, విజయ్ కుమార్, అక్షయ్ సుహాస్‌లతో కూడిన భారత జట్టు 1702 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెలిచింది.
 
పంచ్’ అదుర్స్
బాక్సింగ్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల విభాగంలో ఏడింటికి ఏడు స్వర్ణాలను భారత బాక్సర్లు సొంతం చేసుకున్నారు. దేవేంద్రో సింగ్ (49 కేజీలు), మదన్‌లాల్ (52 కేజీలు), శివ థాపా (56 కేజీలు), ధీరజ్ (60 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్‌దీప్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలను అందించారు.
 
జూడోలోనూ ‘
ఏడు
మరోవైపు షిల్లాంగ్‌లో జరిగిన జూడో ఈవెంట్‌లో భారత్ ఏకంగా ఏడు స్వర్ణాలు కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో భూపిందర్ సింగ్ (60 కేజీలు), జస్లీన్ సింగ్ సైని (66 కేజీలు), మంజీత్ (73 కేజీలు), కరణ్‌జీత్ సింగ్ మాన్ (81 కేజీలు)... మహిళల విభాగంలో సుశీలా దేవి (48 కేజీలు), కల్పనా దేవి (52 కేజీలు), అనితా చాను (57 కేజీలు) బంగారు పతకాలు సాధించారు. తైక్వాండో ఈవెంట్‌లో లతికా భండారి (53 కేజీలు), మార్గరీటా రేగీ (62 కేజీలు), నవ్‌జీత్ (80 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలను అందించారు.
 
బంగారు’ కూత...
కబడ్డీలోనూ భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచి బంగారు పతకాలను దక్కించుకుంది. పురుషుల ఫైనల్లో భారత్ 9-7తో పాకిస్తాన్‌పై గెలుపొందగా... భారత మహిళల జట్టు 36-12తో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
 హ్యాండ్‌బాల్‌లో భారత్‌కే రెండు స్వర్ణాలు దక్కాయి. పురుషుల ఫైనల్లో భారత్ 32-31తో పాకిస్తాన్‌పై గెలుపొందగా... మహిళల ఫైనల్లో టీమిండియా 45-25తో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
 
ఫుట్‌బాల్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలువగా... పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. మహిళల ఫైనల్లో భారత్ 4-0తో నేపాల్‌పై విజయం సాధించింది. భారత పురుషుల జట్టు 1-2 గోల్స్ తేడాతో నేపాల్ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు