'వారిద్దరూ యావత్ దేశానికే స్ఫూర్తి'

14 Sep, 2015 18:14 IST|Sakshi
'వారిద్దరూ యావత్ దేశానికే స్ఫూర్తి'

బెంగళూరు: యూఎస్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ తో పాటు మహిళల డబుల్స్ టైటిల్ భారత్ ఖాతాలో చేరడంపై  మాజీ క్రికెట్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ హర్షం వ్యక్తం చేశాడు.  యూఎస్ ఓపెన్ లో హింగిస్ తో కలిసి సానియా మీర్జా మహిళల డబుల్స్ టైటిల్ ను గెలవగా, లియాండర్ పేస్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.  వీరి గెలుపు భారత్ లోని క్రీడాకారుల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతుందని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.  బెంగళూరులో సోమవారం జరిగిన ఓ క్రీడాకార్యక్రమాకి హాజరైన ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ..  సానియా, లియాండర్ పేస్ ల విజయం కేవలం టెన్నిస్ కే పరిమితం కాదని..  యావత్తు దేశంలో క్రీడలపైనే ప్రభావం చూపుతుందన్నాడు.


తొలుత శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నాలుగోసీడ్ పేస్-హింగిస్ 6-4, 3-6, 10-7తో అన్‌సీడెడ్ బెథానీ మాటెక్ సాండ్స్-సామ్ క్వైరీ (అమెరికా)పై విజయం సాధించి యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ టైటిల్ ను గెలవగా,  ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించి టైటిల్ ను గెలుచుకుంది. ఈ తాజా విజయాలతో గ్రాండ్ స్లామ్ కెరీర్ లో లియాండర్ పేస్ 17 వ టైటిల్ ను , సానియా 5వ  టైటిల్ ను సాధించింది.

మరిన్ని వార్తలు