ఆ ట్యాగ్‌ మాకు మాత్రమే ఎందుకు?: రవిశాస్త్రి అసహనం

18 Nov, 2018 18:21 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఎన్నో జట్లు విదేశాల్లో రాణించడం లేదని అలాంటప్పుడు తమపైనే విమర్శలెందుకు చేస్తున్నారని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌ గెలవడం ఎంత ముఖ్యం అన్న ప్రశ్నకు రవిశాస్త్రి జవాబిచ్చాడు. ‘పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. మనతో పాటు విదేశాల్లో పర్యటిస్తున్న ఇతర జట్లను చూడండి. చాలా జట్లు రాణించడం లేదు. 90ల్లో ఆసీస్‌ కొంతకాలం బాగా ఆడింది. దక్షిణాఫ్రికా సైతం కొన్నేళ్లు చెలరేగింది. అంతేగానీ గత ఐదారేళ్ల కాలంలో ఏ జట్టు విదేశాల్లో దుమ్మురేపిందో నాకు చూపించండి. అలాంటప్పుడు భారత్‌నే వేలెత్తి చూపడమెందుకు. విదేశాల్లో ఓడిపోతామని ట్యాగ్‌ మాకు మాత్రమే ఎందుకు’ అని రవిశాస్త్రి అసహనం వ్యక‍్తం చేశాడు.  

ప్రధాన కోచ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యుత్తమ పర్యాటక జట్టుగా టీమిండియాను తయారు చేయడమే తన లక్ష్యంగా రవిశాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది సొంతగడ్డపై అదరగొట్టిన కోహ్లీసేన.. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లో తేలిపోయింది. దాంతో టీమిండియా విమర్శల వర్షం కురిసింది. ప్రధానంగా కోచ్‌ను టార్గెట్‌ చేస్తూ పలువురు క్రికెట్‌ విశ్లేషకులు తమ నోటికి పని చెప్పారు. ప్రస్తుతం ఆసీస్‌ పర్యటనకు భారత్‌ వెళ్లిన నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడాడు.  స‍్వదేశీ జట్టు ఎప్పుడూ వారి పిచ్‌లపై బలంగానే  ఉంటుందనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఒకరిద్దరు స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినంత మాత్రానా ఆసీస్‌ వారి గడ్డపై చాలా పటిష్టమైనదనే తమకు తెలుసన్నాడు. దాని ప్రకారమే ఆ జట్టును ఓడించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు