చేజేతులా ఓడిన టీమిండియా

19 Oct, 2015 02:30 IST|Sakshi
చేజేతులా ఓడిన టీమిండియా

మూడో వన్డేలో భారత్ చిత్తు  
18 పరుగులతో అనూహ్య ఓటమి
సఫారీలను గెలిపించిన మోర్కెల్
 గురువారం నాలుగో వన్డే

 
 భారత్ విజయానికి 50 బంతుల్లో 78 పరుగులు అవసరం... చేయాల్సిన రన్‌రేట్ 9కి పైనే ఉన్నా క్రీజ్‌లో వన్డే చరిత్రలో ఇద్దరు అత్యుత్తమ ఫినిషర్లు కోహ్లి, ధోని ఉన్నారు... ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించినవారు. కానీ వారి వల్ల కూడా సాధ్యం కాలేదు. మధ్య ఓవర్లలో మరీ నెమ్మదిగా ఆడటంతో పెరిగిన ఒత్తిడి జట్టును కుప్పకూల్చింది. ఫలితంగా భారత్‌కు అనూహ్య పరాజయం.
 
 గత మ్యాచ్‌లో తక్కువ లక్ష్యాన్ని భారత్ కాపాడుకోగా ఈసారి సీన్ రివర్స్ అయింది. ఒక దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ మోర్నీ మోర్కెల్ అద్భుత బౌలింగ్‌కు చేజారింది. నాలుగు బంతుల వ్యవధిలో ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసి అతను దెబ్బ కొట్టాడు. చేతిలో వికెట్లు ఉన్నా రన్‌రేట్ పెరిగిపోవడంతో టీమిండియా ఏమీ చేయలేక చేతులెత్తేసింది.

 
 రాజ్‌కోట్: సాధారణ విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన భారత్ అనూహ్యంగా ప్రత్యర్థికి మ్యాచ్ అప్పగించింది. మ్యాచ్‌ను శాసించే స్థితిలో ఉండి కూడా విజయాన్ని చేజార్చుకుంది. ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో ఆదివారం జరిగిన  మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ (118 బంతుల్లో 103; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా, ఫాఫ్ డు ప్లెసిస్ (63 బంతుల్లో 60; 6 ఫోర్లు) రాణించాడు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 252 పరుగులు మాత్రమే చేయగలిగింది. విరాట్ కోహ్లి (99 బంతుల్లో 77; 5 ఫోర్లు), రోహిత్ శర్మ (74 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో పాటు కెప్టెన్ ధోని (61 బంతుల్లో 47; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా ఓటమి తప్పలేదు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మోర్నీ మోర్కెల్ (4/39) చక్కటి బౌలింగ్‌తో సఫారీలను గెలిపించాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం దక్షిణాఫ్రికా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే గురువారం చెన్నైలో జరుగుతుంది.
 
 కీలక భాగస్వామ్యం...
 పేసర్ ఉమేశ్ స్థానంలో అమిత్ మిశ్రాకు భారత్ అవకాశం కల్పించగా, దక్షిణాఫ్రికా మార్పులు లేకుండా బరిలోకి దిగింది. డి కాక్‌కు జోడీగా కెరీర్‌లో తొలిసారి మిల్లర్ (41 బంతుల్లో 33; 4 ఫోర్లు) ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. భువనేశ్వర్ మెయిడిన్‌తో ప్రారంభమైన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆ తర్వాత కోలుకుంది. ఓపెనర్లు జాగ్రత్తగా ఆడటంతో పవర్ ప్లేలో జట్టు స్కోరు 59 పరుగులకు చేరింది. హర్భజన్ ఈ జోడీని విడదీయగా, ఆమ్లా (5) మరోసారి విఫలమయ్యాడు. ఈ దశలో డి కాక్, డు ప్లెసిస్ కలిసి జట్టును ఆదుకున్నారు. 16 పరుగుల వద్ద మోహిత్ బౌలింగ్‌లో డు ప్లెసిస్ అవుటైనా, అది నోబాల్ కావడంతో బతికిపోగా... మరో నాలుగు పరుగుల తర్వాత రైనా, అతని క్యాచ్ వదిలేశాడు.
 
  52 బంతుల్లో డు ప్లెసిస్ సిరీస్‌లో వరుసగా మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మరోవైపు తీవ్ర ఎండతో ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ కొనసాగించిన డి కాక్ 114 బంతుల్లో వన్డేల్లో భారత్‌పై నాలుగో శతకం నమోదు చేశాడు. మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం తర్వాత చివరకు ప్లెసిస్‌ను మోహిత్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే డి కాక్ రనౌటయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన మరుసటి బంతికే డివిలియర్స్ (4) వికెట్ల ముందు దొరికిపోవడంతో సఫారీల జోరుకు కళ్లెం పడింది. డుమిని (14) ప్రభావం చూపకపోగా... చివర్లో బెహర్దీన్ (36 బంతుల్లో 33 నాటౌట్; 1 సిక్స్) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఒక దశలో 300కు పైగా స్కోరు సాధిస్తుందనుకున్న దక్షిణాఫ్రికా, భారత స్పిన్నర్లు కట్టడి చేయడంతో చివరి 10 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
 రాణించిన రోహిత్, కోహ్లి...
 రోహిత్ తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా, ధావన్ (13) మాత్రం తడబడ్డాడు. డుమిని తొలి ఓవర్లో 18 పరుగుల వద్ద మోర్కెల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ ఆ తర్వాత కుదురుకున్నాడు. మోర్కెల్ బౌలింగ్‌లో ధావన్ వెనుదిరగ్గా... కోహ్లి మళ్లీ మూడో స్థానంలో వచ్చాడు. వీరిద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చక్కటి సమన్వయంతో ఆడుతూ చకచకా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో తాహిర్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో 65 బంతుల్లో రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
 
  రెండో వికెట్‌కు 72 పరుగులు జత చేసిన అనంతరం డుమిని బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, ధోని కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. సఫారీ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో ఎలాంటి అనూహ్య మలుపులు లేకుండా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 62 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే వీరిద్దరు కొద్దిసేపు అతి జాగ్రత్తగా ఆడటంతో  పరుగులు రావడం తగ్గిపోయింది.
 
  31-40 ఓవర్ల మధ్యలో భారత్ 37 పరుగులు మాత్రమే చేయడంతో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. 57 బంతుల పాటు బౌండరీనే రాలేదు!  దాంతో వేగంగా పరుగులు సాధించే క్రమంలో 19 పరుగుల వ్యవధిలో ధోని, కోహ్లి, రహానే వెనుదిరగడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ముందుగా ధోనిని వెనక్కి పంపిన మోర్కెల్... తన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లి, రహానేలను అవుట్ చేసి సఫారీల విజయాన్ని ఖాయం చేశాడు.
 
 స్కోరు వివరాలు
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (రనౌట్) 103; మిల్లర్ (సి) రహానే (బి) హర్భజన్ 33; ఆమ్లా (స్టంప్డ్) ధోని (బి) మిశ్రా 5; డు ప్లెసిస్ (సి) భువనేశ్వర్ (బి) మోహిత్ 60; డివిలియర్స్ (ఎల్బీ) (బి) అక్షర్ 4; డుమిని (సి) రైనా (బి) మోహిత్ 14; బెహర్దీన్ (నాటౌట్) 33; స్టెయిన్ (రనౌట్) 12; రబడ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 270.
 
 వికెట్ల పతనం: 1-72; 2-87; 3-205; 4-210; 5-210; 6-241; 7-264.
 బౌలింగ్: భువనేశ్వర్ 10-1-65-0; మోహిత్ 9-0-62-2; హర్భజన్ 10-0-41-1; మిశ్రా 10-0-38-1; అక్షర్ 9-0-51-1; రైనా 2-0-13-0.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) డుమిని 65; ధావన్ (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 13; కోహ్లి (సి) మిల్లర్ (బి) మోర్కెల్ 77; ధోని (సి) స్టెయిన్ (బి) మోర్కెల్ 47; రైనా (సి) మిల్లర్ (బి) తాహిర్ 0; రహానే (సి) మిల్లర్ (బి) మోర్కెల్ 4; అక్షర్ (నాటౌట్) 15; హర్భజన్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 252.
 
 వికెట్ల పతనం: 1-41; 2-113; 3-193; 4-206; 5-216; 6-216.
 బౌలింగ్: స్టెయిన్ 10-0-65-0; రబడ 10-0-39-0; మోర్కెల్ 10-1-39-4; డుమిని 8-0-46-1; తాహిర్ 10-0-51-1; బెహర్దీన్ 2-0-9-0.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా