చెన్నైలో మాజీ క్రికెటర్ సందడి..!

9 Aug, 2017 17:45 IST|Sakshi
చెన్నైలో మాజీ క్రికెటర్ సందడి..!

చెన్నై: క్రికెట్ ప్రపంచంలో అతనంటే తెలియాని వాళ్లు ఉండరు. గ్రౌండ్లోకి దిగాడంటే బాల్కు కూడా భయం పుట్టిస్తాడు. అతనే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్.  బుధవారం ఆయన  చైన్నైలో సందడి చేశారు. ఆలపాక్కంలోని వేళమ్మాల్ విద్యా సంస్థ విద్యార్థులతో ముచ్చటించారు. విద్య, క్రీడాపరంగా ప్రతిభను చాటుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా వేళమ్మాల్ విద్యాసంస్థ ఏటా దేశవిదేశాల్లోని ప్రముఖుల్ని పిలిపించి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి ముందుకు సాగే రీతిలో కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది.

ఈ నేపథ్యంలో బుధవారం అలాంటి కార్యక్రమం నిమిత్తం వచ్చిన జాంటీ రోడ్స్కు మేళతాళాల నడుమ తమిళ సంప్రదాయంతో స్వాగతం పలికారు. విద్యార్థులు జాంటీ మాస్క్లను ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జాంటీ రోడ్స్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే రీతిలో ఈ విద్యా సంస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఈ మాజీ క్రికెటర్ పిలుపునిచ్చారు. సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్లు ఇక్కడకు వచ్చినట్టు తెలిసిందని, తాను కూడా ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

విద్యాసంస్థ కరస్పాండెంట్ ఎం.వేల్మోహన్ నేతృత్వంలో జాంటీకి నిలువెత్తూ పూలమాలతో ఘన సన్మానం జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన తన ముఖ చిత్రంతో కూడిన వాల్ పెయింటింగ్పై సంతకం చేశారు.  ఈ కార్యక్రమంలో ఆ విద్యా సంస్థ ప్రిన్సిపల్ ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు