అందుకు ధోనినే కారణం: జాదవ్

23 Jan, 2017 13:30 IST|Sakshi
అందుకు ధోనినే కారణం: జాదవ్

కోల్కతా:ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేల సిరీస్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఎక్కువ సమయం గడపడం వల్ల తాను పలు విషయాలను నేర్చుకున్నట్లు సహచర ఆటగాడు కేదర్ జాదవ్ పేర్కొన్నాడు.  ప్రధానంగా ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలి అనే విషయాన్ని ధోని నుంచి నేర్చుకున్నట్లు జాదవ్ తెలిపాడు. 'నేను జట్టులోకి ఎప్పుడైతే వచ్చానో.. అప్పుడు ధోనితో కలిసి ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది. దాంతో క్లిష్ట పరిస్థితుల్లో కూల్గా ఎలా ఉండాలి అనే విషయాన్ని ధోని నుంచి నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. నేను ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బ్యాటింగ్ చేయడానికి ఇక్కడ ధోని సాయపడ్డాడనే చెప్పాలి'అని జాదవ్ తెలిపాడు.

ఇదిలా ఉంచితే, చివరి ఓవర్లో పదహారు పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు బంతుల్లో 10 పరుగులు రాబట్టడంపై జాదవ్ స్పందించాడు. ఆఖరి ఆరు బంతుల్ని ఎలా ఆడాలి అనే దానిపై ముందే ఒక ప్రణాళిక రచించుకునే ఆడటానికి సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా బౌలర్ పై ఎదురుదాడికి దిగి అతనిపై ఒత్తిడి పెంచాలనే వ్యూహాన్ని అమలు చేయాలనుకునే క్రమంలోనే తొలి రెండు బంతుల్ని బౌండరీలు దాటించినట్లు జాదవ్ తెలిపాడు. దీనిలో భాగంగానే ఒక భారీ షాట్ కు యత్నించి అవుట్ కావడం నిరాశ కల్గించదన్నాడు. ఇక్కడ మ్యాచ్ ను గెలిపించి ఉంటే ఇంకా సంతోష పడేవాడినని పేర్కొన్న జాదవ్.. ప్రస్తుత తన బ్యాటింగ్ తో సంతృప్తికరంగా ఉన్నానని తెలిపాడు. ఈ సిరీస్ లో జాదవ్ 232 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.