పాక్‌కు చివరకు మిగిలింది రిక్తహస్తమే..

10 Oct, 2019 08:50 IST|Sakshi

లాహోర్‌: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు చివరకు రిక్తహస్తమే మిగిలింది. తన కంటే ఎంతో బలహీనమైన శ్రీలంక చేతిలో పాక్‌ వైట్‌వాష్‌కు గురయింది. టీ20లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉండి, స్వదేశంలో జరుగుతున్న తొలి పొట్టి సిరీస్‌ను పాక్‌ కాపాడుకోలేకపోయింది. తొలి రెండు టీ20ల్లో ఓడిపోయిన పాక్‌ చివరి మ్యాచ్‌లో గెలిచి కనీసం పరువు కాపాడుకోవలనుకుంది. కానీ నిరాశే ఎదురైంది.  బుధవారం జరిగిన మూడో టీ20లో పాక్‌పై శ్రీలంక 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20 సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ పనిపట్టడంతో పాటు, సిరీస్‌లో నిలకడగా రాణించిన వనిండు హసనరంగాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు లభించాయి. 

ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఒషాదా ఫెర్నాండో (78 నాటౌట్‌, 48 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు) రఫ్పాడించడంతో పాక్‌ ముందు లంక మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్టు కోల్పోఇయ 134 పరుగులే చేసి ఓటమి పాలైంది. పాక్‌ ఆటగాళ్లలో హారిస్‌ సోహైల్‌ (52; 50 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. లంక బౌలర్లలో  వనిండు హసరంగా మూడు వికెట్లతో చెలరేగగా.. లహిరు కుమార రెండు వికెట్లతో రాణించాడు. 

మరిన్ని వార్తలు