ఒక్క చాన్స్‌ ఇవ్వండి.. నేనేంటో నిరూపిస్తా

10 May, 2020 02:35 IST|Sakshi

ఆ జ్ఞాపకాలన్నీ...

ఓపెనర్‌గా మారి చెలరేగిన సచిన్‌ టెండూల్కర్‌

భారత క్రికెట్‌ రాత మార్చిన ఇన్నింగ్స్‌

49 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు

మార్చి 27, 1994... ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు భారత్‌ సన్నద్ధమైంది. అయితే ఆ రోజు ఉదయమే మెడ పట్టేయడంతో ఓపెనర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మ్యాచ్‌ ఆడటం తన వల్ల కాదన్నాడు. భారత జట్టు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్న సమయంలో కెప్టెన్‌ అజహరుద్దీన్, కోచ్‌ అజిత్‌ వాడేకర్‌ వద్దకు సచిన్‌ టెండూల్కర్‌ వెళ్లాడు. అప్పటి వరకు మిడిలార్డర్‌లో ఆడుతున్న తనకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వమని కోరాడు. వారు సందేహిస్తున్న తరుణంలో ‘ఒక్క చాన్స్‌’ అంటూ బతిమాలాడు. విఫలమైతే మళ్లీ అడగనని కూడా చెప్పేశాడు. అయితే ఆ తర్వాత అలాంటి అవసరమే రాలేదు. ఓపెనర్‌ హోదాలో తన తొలి వన్డేలో ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో సచిన్‌ భారత క్రికెట్‌లో కొత్త శకానికి తెర తీశాడు.    
    
ఓపెనర్‌గా సచిన్‌ బరిలోకి దిగిన మ్యాచ్‌ అతని వన్డే కెరీర్‌లో 70వది. అప్పటి వరకు ఆడిన 69 వన్డేల్లో సచిన్‌ ఒక్క శతకం కూడా నమోదు చేయలేదు. 13 అర్ధ సెంచరీలు మాత్రం అతని ఖాతాలో ఉన్నాయి. అయితే తన ఆటపై తనకున్న నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో అతను వేసిన ముందడుగు పలు ఘనతలకు నాంది పలికింది. దీనిపై అజహర్‌... ‘సచిన్‌లో ఉన్న ప్రతిభ గురించి ఆ సమయానికే అందరికీ తెలుసు కాబట్టి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ అతను తన పూర్తి సత్తాను ప్రదర్శించేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూశాడు. అదే ఇలా వచ్చింది’ అని చెప్పాడు.  

మెరుపు బ్యాటింగ్‌ సాగిందిలా...
టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే భారత బౌలింగ్‌ ధాటికి జట్టు 142 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యమే అయినా తనేంటో చూపించాలనే పట్టుదలతో ఉన్న సచిన్‌ తొలి బంతినుంచే విరుచుకుపడ్డాడు. 49 బంతుల్లోనే 82 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. ఇందులో 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఏకంగా 167.34 స్ట్రయిక్‌రేట్‌తో అతను ఈ పరుగులు చేయడం విశేషం. బౌండరీల ద్వారానే 72 పరుగులు వచ్చాయి.  టి20ల జోరు సాగుతున్న ఈ కాలంలో ఇది సాధారణంగా అనిపించవచ్చు కానీ 26 ఏళ్ల క్రితం ఇలాంటి బ్యాటింగ్‌ అంటే అత్యంత అద్భుత ప్రదర్శనగా భావించాలి.

సచిన్‌ కొట్టిన కొన్ని చూడచక్కటి షాట్లతో ఈడెన్‌ పార్క్‌ అదిరిపోగా, భారత అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అప్పటివరకు అజహర్‌ పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ సెంచరీ (62 బంతుల్లో) రికార్డు సునాయాసంగా బద్దలైపోతుందేమో అనిపించింది. మరో 12 బంతుల్లో 18 పరుగులు చేయడం కష్టంగా ఏమీ అనిపించలేదు. అయితే లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మాథ్యూ హార్డ్‌ వేసిన బంతిని ఆడే క్రమంలో ఎడ్జ్‌ తీసుకోవడంతో అతనికే రిటర్న్‌ క్యాచ్‌ వెళ్లింది. అలా సచిన్‌ సూపర్‌ ఓపెనింగ్‌ ముగిసింది. సచిన్‌ ధాటికి 23.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి భారత్‌ సునాయాసంగా విజయాన్ని అందుకుంది.  

మలుపు తిరిగిన కెరీర్‌...
ఈ మ్యాచ్‌ తర్వాత సిద్ధూ మూడో స్థానానికి మారిపోగా, వరుసగా తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా సచిన్‌ 63, 40, 63, 73 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే తన 79వ వన్డేలో సచిన్‌ తొలి సెంచరీని (ఆస్ట్రేలియాపై) నమోదు చేశాడు. తన 463 వన్డేల కెరీర్‌లో 340 మ్యాచ్‌లలో సచిన్‌ ఓపెనర్‌గానే ఆడాడు. తన 49 వన్డే సెంచరీలలో 45 ఓపెనర్‌గానే వచ్చాయి. ఓపెనర్‌గా మారిన తర్వాత కూడా జట్టు అవసరాలరీత్యా కొన్నిసార్లు అతను మళ్లీ మిడిలార్డర్‌లో ఆడాల్సి వచ్చింది. అలా నాలుగో స్థానంలో ఆడి అతను మిగిలిన 4 సెంచరీలు సాధించాడు.
 
ఆ సమయంలో బౌలర్లపై ఎదురుదాడి చేయగల సామర్థ్యం నాకుందని, తొలి 15 ఓవర్లలో ఉన్న ఫీల్డింగ్‌ పరిమితులను దృష్టిలో ఉంచుకొని చూస్తే ఫీల్డర్ల పైనుంచి షాట్లు ఆడగల సత్తా ఉందని నమ్మాను. నాకు ఒక అవకాశం లభిస్తే చాలనుకునేవాడిని. అందుకే ఓపెనింగ్‌ చేయడం గురించి ఆలోచించాను.  ఆ తర్వాత కివీస్‌ స్వల్ప స్కోరే చేసినా మన జట్టుకు ఘనమైన ఆరంభం ఇవ్వడం కీలకమని భావించా. కెప్టెన్, కోచ్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయవద్దనుకున్నా. ప్రశాంత మనసులో పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాను. అన్నీ కలిసి రావడంతో అలవోకగా పరుగులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వైఫల్యం గురించి భయపడకపోవడమే నాకు విజయాన్ని అందించింది.
   –సచిన్‌


వన్డేల్లో ఓపెనర్‌గా తొలి ఇన్నింగ్స్‌ ఆడుతూ...


బంగ్లాదేశ్‌తో 2012 మార్చి 16న ఢాకాలో జరిగిన వన్డేలో కెరీర్‌లో 100వ సెంచరీ పూర్తి చేసుకున్న క్షణాన....

– సాక్షి క్రీడా విభాగం  

>
మరిన్ని వార్తలు