రసవత్తర పోరు

27 May, 2016 00:25 IST|Sakshi
రసవత్తర పోరు

హర్షాభోగ్లే

 
గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సన్నద్ధమయ్యాయి. విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌తో గుజరాత్ పటి ష్టంగా కనిపిస్తున్నప్పటికీ... ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కతాను నిలువరించిన హైదరాబాద్‌నూ తక్కువ అంచనా వేయలేం. గుజరాత్‌కు మెకల్లమ్, పించ్, స్మిత్, రైనాల రూపంలో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇప్పటి వరకు గుజరాత్‌ను అన్ని మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్లే నియంత్రించారు. దీనికి భిన్నంగా హైదరాబాద్ పటిష్టమైన పేస్ లైనప్‌తో బరిలోకి దిగుతుంది. ఎలిమినేటర్‌లో రాణించిన కటింగ్, హెన్రిక్స్ మరోసారి కీలకం కావచ్చు. ముస్తఫిజుర్ రూపంలో హైదరాబాద్‌కు మంచి ఆయుధం ఉంది. భువనేశ్వర్ కూడా మునుపటి రీతిలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొత్తం మీద ఇది గుజరాత్ బ్యాట్స్‌మెన్‌కు, సన్‌రైజర్స్ బౌలర్లకు మధ్య జరిగే రసవత్తర పోరు. ఎవరు పైచేయి సాధిస్తే వారిదే ఫైనల్ బెర్తు. తరచి చూస్తే సన్ జట్టు కూర్పులో వైవిధ్యం ఉంటుంది. వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్, ఇయాన్ మోర్గాన్, కరణ్ శర్మ ఇలా దాదాపు అంతా లెఫ్ట్ హ్యాండ ర్స్‌తో నిండి ఉంటుంది. వీరికి తగిన బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ప్రత్యర్థికి సవాలుతో కూడిన పని.

ఈ కూర్పును దృష్టిలో పెట్టుకునే కోల్‌కతా షకీబుల్ హసన్‌ను చివరిమ్యాచ్‌లో తప్పించింది. రైనా కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తుది జట్టును ఎంచుకోవాలి. ఏమైనా... ఆరంభంలో వికెట్లు తీయగలిగితే హైదరాబాద్‌ను కట్టడి చేయవచ్చు. మొదటి నుంచి బ్యాటింగ్ భారమంతా వార్నర్ ఒక్కడే మోస్తున్నాడు. తాజాగా శిఖర్ ధావన్, యువరాజ్‌లు కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇన్నాళ్లూ బౌలింగ్ విభాగంపై, వార్నర్ పైనా ఆధారపడ్డ హైదరాబాద్‌కు వీరిద్దరూ బ్యాట్‌ను ఝుళిపించడం కలిసొచ్చే అంశం.

మరిన్ని వార్తలు