ఆ నివేదిక కూడా గోప్యమేనా?! | Sakshi
Sakshi News home page

ఆ నివేదిక కూడా గోప్యమేనా?!

Published Fri, May 27 2016 12:25 AM

ఆ నివేదిక కూడా గోప్యమేనా?!

 విశ్లేషణ

ఢిల్లీలో శాసనసభను రద్దు చేయాలని ఎల్‌జీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు ఏ రక్షణా లేదు. అంతే గాకుండా గవర్నర్‌కు ఉన్న రక్షణ నియమాలను రాజ్యాంగంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కల్పించలేదు.

 
దేశభద్రత వంటి కీలకమైన అంశాల్లో తప్ప ప్రభుత్వాలు పాలనా రహస్యాలు అంటూ సమాచారం చెప్పకుండా దాచడానికి ప్రస్తుతం వీల్లేదు. సర్కారీ పెద్దల మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పాలనకు సంబంధించినైవైతే బయట పెట్టడానికి వీల్లేదని ప్రభుత్వం వాటిని దాచడానికి వీలుగా ప్రివిలేజిని వాడుకోవడానికి సాక్ష్య చట్టం సెక్షన్ 123 అనుమతించేది. దీనిపైన చాలా వాద వివాదాలు చెలరేగాయి. ఎన్నో కోర్టు తీర్పులు ప్రివిలేజి విస్తారాన్ని తగ్గించాయి. రాష్ర్టపతి ఉత్తర్వులు, గవ ర్నర్ నివేదికలు, ప్రధాన న్యాయమూర్తికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన లేఖాయణం ఇవన్నీ ఒకప్పుడు మూడో కంటికి తెలియడానికి వీల్లేని పాలనా వ్యవహరాలనీ, కనుక వీటిని బయట పెట్టడానికి వీల్లేదని సూత్రీకరించారు.


 సార్వభౌమాధికారం ఉన్న కార్యపీఠాలు తమ వ్యవహారాల గురించి చెప్పితీరాలని అడిగే అధికారం కూడా ఎవరికీ లేదనే వాదం కూడా తరచూ వినిపించేది. ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ పేరుతో ప్రజావ్యవహారాల సమాచారం మరుగునపడేది. కాని సమాచార హక్కు చట్టం 2005 వచ్చిన తరువాత అటువంటి ప్రివిలేజికి స్థానం లేదు. సెక్షన్ 123 సాక్ష్య చట్టం నియమాన్ని కాదని సెక్షన్ 22 సమాచార హక్కు చట్టం పనిచేస్తుంది. ఆ సమాచారం ఇవ్వవచ్చా లేదా అనే విషయంలో సెక్షన్ 8, 9 తప్ప మరే ఇతర శాసన నియమాలను కూడా పరిశీ లించడానికి వీల్లేదు.


 2013-14లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత లెఫ్టినెంట్ గవ ర్నర్ (ఎల్‌జి)కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక, దానికి సంబంధించిన ఇతర పత్రాల ప్రతులు ఇవ్వాలని ఆదిత్య అనే   యువకుడు సహ చట్టం కింద అడిగారు. ఎల్‌జీ  కార్యాలయం ఇవ్వడానికి వీల్లేదన్నది. మొదటి అప్పీలులో కూడ చుక్కెదురైంది.

రెండో అప్పీలులో కమిషన్ ముందు ఈ ప్రశ్నకు సమాధానం, సమాచారం దొరుకుతుందా అన్నది రాజ్యాంగం కీలక శాసనాల సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈమెయిల్‌లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆర్డర్లు, లాగ్ పుస్త కాలు, ఒప్పందాలు, నివేదికలు, కాగితాలు, నమూ నాలు, మోడల్స్, డేటా, వంటివి ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నవి కూడా సమాచారం నిర్వచనంలోకి వస్తాయని సెక్షన్ 2(ఎఫ్) సహ చట్టం వివరించింది.

లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చింది నివేదిక అయినా, సలహా అయినా, అభిప్రాయమైనా సరే ఈ నిర్వచనం పరిధిలోనే ఉంటుంది. ఇది లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపినది కనుక వారి కార్యాలయంలోనూ, కేంద్ర హోంమంత్రి కార్యాలయంలోనే ఉండి తీరుతుంది. అది సమాచారమే అయి, ప్రభుత్వ అధీనంలో ఉండి ఉంటే వెల్లడించాల్సిందే. అయితే అంతకు ముందు ఒక్కసారి పరిమితులు, మినహాయింపులు ఏమైనా వర్తిస్తాయో లేదో పరిశీలించాలి. ఎల్‌జీ కార్యాలయ ప్రజాసమాచార అధికారి సెక్షన్ 8(1)(ఐ) కింద ఆ నివేదిక ఇవ్వడానికి వీల్లేదన్నారు.

పార్లమెంటు లేదా శాసనసభల ప్రత్యేకా ధికారాల (ప్రివిలేజ్)కు భంగం కలిగిస్తుందనుకునే సమాచారాన్ని ఇవ్వనవసరం లేదని ఈ సెక్షన్ నిర్దేశిం చింది. ఈ నివేదిక వెల్లడి పార్లమెంటు ప్రివిలేజ్‌ని ఏవిధంగా దెబ్బతీస్తుందని వివరించలేదు. ఊరికే సెక్షన్ నెంబరు చెబితే సరిపోదు. అది ఏ విధంగా వర్తిస్తుందో సమర్థించే బాధ్యత ప్రజా సమాచార అధికారిపైన ఉందని సెక్షన్ 19(5) చాలా స్పష్టంగా వివరిస్తున్నది.

అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత మరో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని, కనుక ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలనే ఎల్‌జీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంత జరిగిన తరు వాత వెల్లడి చేయబోమనడానికి అందులో ఏముంది అనేది ప్రశ్న. ఆర్టికల్ 74(2) కింద రాష్ర్టపతికి కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాను, లేదా ఆర్టికల్ 163(3) కింద గవర్నరుకు రాష్ర్ట మంత్రి మండలి ఇచ్చిన సలహాలో లోటుపాట్లను దర్యాప్తుచేసే అధికారం కోర్టు లకు లేదని రాజ్యాంగం వివరిస్తున్నది. కాని మంత్రి మండలి ఆ సలహానివ్వడానికి ఆధారభూతమైన నివేది కలు పరిస్థితులను సమీక్షించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉందని, ఈ సమీక్షాధికారం మన రాజ్యాంగ మౌలిక స్వరూపమని దాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదని ఎస్‌ఆర్ బొమ్మయ్ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.


 అంటే మంత్రి మండలి సలహాకు ప్రివిలేజ్ ఉందనుకోవచ్చు. కాని గవర్నర్ నివేదిక ఆ సలహాకు ఆధారం అవుతుంది కనుక పరిశీలించే అధికారం కోర్టులకు ఉందని వివరణ ఇచ్చారు. అంటే ఢిల్లీలో శాసనసభను రద్దు చేయాలని ఎల్‌జీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు ఏ రక్షణా లేదు. అంతే గాకుండా గవర్నర్‌కు ఉన్న రక్షణ నియమాలు రాజ్యాంగంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కల్పించలేదు. లెఫ్టినెంట్ అంటే ఉప అని అర్థం, ఉప రాజ్య పాలకుడికి ఈ ప్రివిలేజ్ లేదు.

ప్రివిలేజ్ ఉందనుకున్నా అది దర్యాప్తు నుంచి రక్షణే కాని అది రహస్యమని అర్థం కాదు. అయినా సమాచారం అడిగిన అభ్యర్థిగా, రెండో అప్పీలు విచా రిస్తున్న సమాచార కమిషన్ గానీ, సలహా బాగోగులకు దర్యాప్తు చేయడం లేదు. ఆ నివేదిక ప్రతిని ఇవ్వమని మాత్రమే కోరుతున్నారు.
 (ఇఐఇ/అ/అ/2015/000748 ఆదిత్య వర్సెస్ ఎల్‌జి సచివాలయం కేసులో 25.5.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 
 మాడభూషి శ్రీధర్
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 professorsridhar@gmail.com

Advertisement
Advertisement