విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు

4 Jul, 2018 08:34 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

మెకల్లమ్‌ రికార్డ్‌ బద్దలుకొట్టిన కోహ్లి

సాక్షి, స్పోర్ట్స్‌ (మాంచెస్టర్‌) : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీ20ల్లో అరుదైన ఘనతను సాధించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఛేజింగ్‌లో భాగంగా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత కెప్టెన్‌ 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(56) కోహ్లి ఈ రికార్డ్‌ నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతుల్లో 20 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. కాగా, టీమిండియా తరఫున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌ కోహ్లినే కావడం విశేషం. ఓవరాల్‌గా నలుగురు క్రికెటర్లు ఈ ఘనత సాధించారు.

న్యూజిలాండ్‌ ప్లేయర్‌ మార్టిన్‌ గప్టిల్‌ 2,271 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. కివీస్‌కే చెందిన మెక్‌కల్లమ్‌ 2,140 పరుగులతో, పాకిస్తాన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ 2,039 పరుగులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అయితే ఈ ఫీట్‌ చేరుకోవడానికి మెక్‌కల్లమ్‌ 66 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, విరాట్‌ కోహ్లి కేవలం 56వ ఇన్నింగ్స్‌లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గప్టిల్ 68వ ఇన్నింగ్స్‌లో‌, షోయబ్‌ మాలిక్‌ 92వ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. 60 టీ20 మ్యాచ్‌లాడిన కోహ్లి 56వ ఇన్నింగ్స్‌ (అతి తక్కువ)లోనే అ అరుదైన ఫీట్‌ నెలకొల్పాడు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలోనూ పలు రికార్డులు నమోదు చేసిన కోహ్లిని టీ20ల్లో సెంచరీ కోరిక మాత్రం ఊరిస్తూనే ఉంది. 56 ఇన్నింగ్స్‌ల్లో 49.07 సగటుతో 2012 పరుగులు చేశాడు కోహ్లి. అయితే రోహిత్‌ శర్మ 19 పరుగులు చేస్తే టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న టీమిండియా రెండో క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా నిలుస్తాడు.

కాగా మూడు టీ20ల భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత కుల్దీప్‌(5/24) బౌలింగ్‌ ముందు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ తేలిపోగా.. అనంతరం లోకేశ్‌ రాహుల్‌(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగాడు.

మరిన్ని వార్తలు