వారికి మరికొంత సమయం ఇవ్వాలి:కోహ్లి

23 Jan, 2017 12:55 IST|Sakshi
వారికి మరికొంత సమయం ఇవ్వాలి:కోహ్లి

కోల్కతా: ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డేలో గెలుపు ముంగిట వరకూ వచ్చిన భారత్ జట్టు ఓటమి చెందింది. ఇంగ్లండ్ విసిరిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ చివరి వరకూ పోరాడి పరాజయం పాలైంది. అయితే ఈ మూడు వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్ లో టాపార్డర్  తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా కీలక పాత్ర పోషించింది. అయితే టాపార్డర్ లో ఓపెనర్లు  ఘోరంగా విఫలం చెందడం మినహా భారత్ జట్టు ప్రదర్శన బాగుందనే చెప్పాలి.

ఈ వన్డే సిరీస్లో భారత ఓపెనర్లు ముగ్గురూ కలిపి చేసిన 37 పరుగులు జట్టులో ఆందోళన పెంచాయి. తొలి రెండు వన్డేల్లో శిఖర్ ధావన్ నిరాశపరిస్తే, మూడో వన్డేలో అతని స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అజింక్యా రహానే పరుగు మాత్రమే చేశాడు. ఇక మూడు వన్డేలు ఆడిన కేఎల్ రాహుల్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో భారత ఓపెనింగ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా చివరి వన్డేలో భారత్ ఓటమికి ఓపెనర్లే కారణమని విశ్లేషకులు మండిపడుతున్నారు. అయితే భారత ఓపెనర్లను కెప్టెన్ విరాట్ కోహ్లి వెనకేసుకొచ్చాడు. 'భారత్కు మంచి ఓపెనర్లు ఉన్నారు.

ఓపెనర్ల కోసం వేరే అన్వేషణ అనవసరం అనేది నా భావన. ప్రస్తుత ఓపెనర్లు ఫామ్లో లేరు. వారికి మరికొంత సమయం ఇవ్వాలి. వారు తిరిగి గాడిలో పడటానికి కొద్ది సమయం కేటాయిస్తే చాలు.గతంలో మాకు ఓపెనర్ల ఇబ్బంది ఉండేది కాదు..కేవలం మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బాగుంటే.. ఓపెనర్లు నిరాశపరిచారు. దీన్ని సమస్యగా భావించడం లేదు. తొందర్లోనే అంతా సర్దుకుంటుంది' అని కోహ్లి పేర్కొన్నాడు.